14-05-2025 05:26:02 PM
నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల ధాన్యం కొనుగోలు కేంద్రం, డబుల్ బెడ్ రూంల తనిఖీ..
ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. ఆసుపత్రి సేవల పట్ల సంతృప్తి..
నల్లగొండ (విజయక్రాంతి): రోజువారి తనిఖీలలో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) బుధవారం నార్కెట్ పల్లి మండలంలో పర్యటించారు. పలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ సిబ్బంది పనితీరును పరిశీలించారు. ముందుగా జిల్లా కలెక్టర్ మండలంలోని బ్రాహ్మణ వెల్లేములలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని, రికార్డుల నిర్వహణను, ట్రక్ షీట్లను తనిఖీ చేశారు. మూడు, నాలుగు రోజుల్లో ఈ కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు మొత్తాన్ని పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఇందుకుగాను ఎక్కువ లారీలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ ను ఆదేశించారు. అలాగే బ్రాహ్మణ వెళ్లెముల ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాన్ని నల్గొండలోని రైస్ మిల్ కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పక్కనే ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ సౌకర్యాలన్నింటి పరిశీలించారు. పెండింగ్ పనులన్నింటిని 15 రోజుల్లో పూర్తి చేసి శాసనసభ్యుల ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ డాక్టర్ల, సిబ్బంది, పనితీరును, హాజరు రిజిస్టర్లను, మందులు స్టాక్ రిజిస్టర్ అన్నిటినీ పరిశీలించిన అనంతరం ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఇక్కడ సిబ్బందికి టాయిలెట్స్ లేవని టాయిలెట్స్ కావాలని, అదేవిధంగా రోగులకు బెంచీలు కావాలని విజ్ఞప్తి చేయగా జిల్లా కలెక్టర్ నిధుల నుండి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, నార్కెట్ పల్లి తహసిల్దార్ వెంకటేశ్వరరావు, సంబంధిత సంస్థల ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.