14-05-2025 05:15:50 PM
వరంగల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తీగల జీవన్..
హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) మొదటి గేటు వద్ద ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత(పి.డి.ఎస్.యు) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో డాక్టర్ బుర్రా రాములు 14వ యాది సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి ఘనంగా పూలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్(Warangal Bar Association) మాజీ అధ్యక్షుడు తీగల జీవన్ మాట్లాడుతూ... బుర్రా రాములు తన జీవితాన్ని మానవ, పౌర హక్కుల కోసం త్యాగం చేశాడని గుర్తు చేశారు.
తను బ్రతికున్నంత కాలం ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి ప్రజలకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులు పొందేలా పోరాటం చేశారన్నారు. అలాంటి బుర్రా రాములు ఈరోజు మన మధ్య లేకపోవడం పౌరహక్కులకు పెద్ద లోటుగా ఆయన తెలిపారు. టిపిటిఎఫ్ నాయకులు బైరి స్వామి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో రాములు పాత్ర చాలా కీలకమైనదని, బ్రతుకున్నంత కాలం తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యపరచాడని గుర్తు చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ బుర్రా రాములు ఆశయంగా ఆయన గుర్తుచేస్తూ ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేయడం ఆయనకు మనం ఇచ్చే నివాళిగా తెలిపారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు అప్పారావు మాట్లాడుతూ... బుర్రా రాములు ఆశయాలను ఈ తరం విద్యార్థులు కొనసాగించాలని, విద్యార్థుల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశాడు.
ఆదివాసులపైన జరుగుతున్న దాడులను తక్షణం ప్రభుత్వం ఆపి శాంతి చర్చలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాడు. నేటితరం విద్యార్థులు బుర్రా రాములు స్ఫూర్తితో ప్రశ్నించేతత్వాన్ని, ప్రజాస్వామిక లక్షణాలను, మానవీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రంజిత్ కుమార్, కేయూ పరిశోధక విద్యార్థి మాదాసి రమేష్, జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, జిల్లా నాయకులు ముషారఫ్, గణేష్, నాని, శంకర్, శేఖర్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.