పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకూడదని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం సోఫీనగర్ కేజీబీవీలో ఇంటర్ పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన, పరీక్షల్లో ఫెయిల్ కావడం జీవితంలో అంతిమం కాదని, భయాన్ని విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులంతా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి, సమాజంలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని ప్రోత్సహించారు.
పలు సబ్జెక్టులకు సంబంధించిన మెలుకువలను విద్యార్థులకు వివరించిన కలెక్టర్, ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ఆచరణాత్మక బోధన అందిస్తే విద్యార్థుల్లో విషయ అవగాహన మరింత పెరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, మండల విద్యాధికారి సిద్ది పద్మ, కేజీబివి ప్రత్యేక అధికారి సుజాత, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.






