calender_icon.png 28 July, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి అంతర పంటలో మునగ నాటండి.. లాభాలను రెట్టింపు చేసుకోండి

28-07-2025 05:05:43 PM

రైతులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య సూచనలు

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పత్తి పంట మధ్య మునగ సాగు చేయడం ద్వారా లాభాలను రెట్టింపు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) రైతులకు సూచించారు. జిల్లాలోని రైతులకు వ్యవసాయంలో అత్యధిక లాభాలు గడించి, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్ కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సీజన్‌లో రైతులు శ్రమించి మంచి పంటలు పండించుకుంటూ వ్యవసాయాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇంకా కొన్ని అవకాశాలను రైతులు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా మునగ సాగు గురించి గత సంవత్సరంలో మేము చేసిన అవగాహన కార్యక్రమాల వల్ల జిల్లాలో దాదాపు 100 ఎకరాల్లో మునగసాగు జరిగింది. అలాగే, పత్తితో పాటు మునగను అంతరపంటగా వేసిన రైతుల సంఖ్య కూడా 300 ఎకరాలకు చేరిందన్నారు. 

ప్రస్తుతం రైతులు నాటిన పత్తి జనవరి–ఫిబ్రవరి మధ్య కాలంలో పంట తీసుకునే  దశకు చేరుతుంది. ఇదే సమయాన్ని ఉపయోగించుకుని ఇప్పటి నుంచే మునగ మొక్కల తయారీకి సిద్ధం కావాలని రైతులకు కలెక్టర్ సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ప్లాస్టిక్ బ్యాగులు పొందవచ్చు. ఇంటి వద్దే మట్టి, ఎరువుతో కలిపి వీటిలో విత్తనాలు నాటి రెండు మూడు నెలల్లో మంచి మొక్కలు తయారు చేయవచ్చన్నారు. ఆ మొక్కలను సెప్టెంబరు నాటికి వర్షాలు తగ్గిన అనంతరం పత్తి పొలాల మధ్యలో నాటితే అది పంటకు మేలుచేస్తుంది. ఇది మనకు ఇప్పటికే టేకులపల్లి ప్రాంతంలో  హైజా  అనే ఆదివాసి ఆదర్శ రైతుల ద్వారా చూపబడిన సాఫల్యమైన పద్ధతి అని తెలిపారు. మునగ సాగు ద్వారా రైతులు ఆదాయం, ఉపాధి రెండింటినీ సాధించవచ్చు. ఉదాహరణకు వెయ్యి చెట్లు నాటి ప్రతి చెట్టుకు కనీసం 100 కాయలు కాసినా, ఒక్కొక్క కాయకు రూ.2 రేటు వచ్చినా దాదాపుగా రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చన్నారు. 

ఆకులు కూడా మార్కెట్లోకి అమ్మితే కిలోకు రూ.10 వరకు రేటు దొరుకుతుంది. మార్కెటింగ్ లో ఎలాంటి సమస్యలూ ఉండవు. ఇప్పటికే మన జిల్లాలో మునగ సాగు చేస్తున్న రైతులు మార్కెటింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇతర ఉపాధి అవకాశాల విషయానికొస్తే, మునగ చెట్లకు ఆధారంగా తుమ్మ చెట్లు లేదా వేరే కర్రలను మునగ మొక్కలకు ఆధారంగా గుంతలు తీసి ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా రూ.19,000 వరకు లాభం పొందవచ్చు. ఈ విధంగా రైతులు తమ పొలంలో పనిచేసుకుంటూ ఉపాధి హామీ పథకం ద్వారా ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవచ్చన్నారు. డ్రోన్ స్ప్రే వాడటం ద్వారా మందుల పిచికారీ, యూరియా స్ప్రే లాంటి పనులు సులభంగా చేయవచ్చు. యూరియా బస్తాల కోసం పోటీ చేయాల్సిన అవసరం లేకుండా నానో యూరియా వాడితే మొక్కలకు నేరుగా అవసరమైన పోషకాలు అందుతాయి. 

అలాగే బోర్ వెల్ పక్కన ఒక కుంట లో ఫామ్ పౌండ్ తవ్వించుకోవడం ద్వారా మంచి భూగర్భ జలాలు అభివృద్ధి పరుచుకోవటంతో పాటు భవిష్యత్ తరాలకు నీరు అందించవచ్చు. ఈ ఫామ్ పౌండ్ ను కూడా ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా నిర్మించవచ్చన్నారు. వరిగడ్డి ని వాడుకుంటూ  పుట్టగొడుగు సాగు చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చు అన్నారు . చేపల పెంపకం కోసం ఎకరాలు ఎకరాలు తవ్వువలసి న అవసరం  లేకుండా ఒకే కుంటలో తక్కువ ఖర్చుతో చేపల పెంపకం చేపట్టి పది రెట్ల ఆదాయం పొందే అవకాశాలున్నాయి. మొక్కజొన్న పండించే రైతులు నీటి సౌకర్యం ఉంటే ఆయిల్ ఫామ్ సాగు చెప్పు చేపట్టాలని దానితో అత్యధిక లాభాలు పొందటంతో పాటుగా ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలను అందిస్తుందని ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు.

వెదురు సాగుపై కూడా రైతులు దృష్టి పెట్టాలి అని కలెక్టర్ సూచించారు. ఒక ఎకరాలో సుమారు 160 మొక్కలు నాటి మూడు నాలుగు సంవత్సరాల్లోనే మంచి ఆదాయం పొందవచ్చు అన్నారు. మధ్యలో అంతరపంటలు  వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. దీనిలో అంతర్ పంటగా అదనంగా చెట్లు నాటితే మేతకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి అన్నారు. మన జిల్లాలో దాదాపు 2.5 లక్షల మేకలు ఉన్న నేపథ్యంలో మేత అవసరాన్ని తీర్చేందుకు ఇది చక్కటి పరిష్కారం. మేక పాల ఉత్పత్తి ఆధారంగా లెక్కిస్తే ఉన్నదాంట్లో పది శాతం మేక పావు లీటర్ పాలను ఇచ్చిన కూడా ఈ రంగం నుండి సంవత్సరానికి రూ.10-12 కోట్లు వరకు ఆదాయం పొందడం సాధ్యం అవుతుందన్నారు. పట్టు సెరికల్చర్ పై ఆదివాసీ రైతులు దృష్టి పెట్టాలి. ఇందులో 90% సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుంది.

తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం పొందగలిగే ఈ రంగాన్ని ప్రారంభించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేయాలి అన్నారు. త్వరలోనే మేము ఈ అన్ని అవకాశాలపై ప్రత్యేకంగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాము. అప్లికేషన్లు, సమాచారం, మరియు ఫోన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తాము కలెక్టర్ తెలిపారు. రైతులందరూ సెప్టెంబర్ నాటికి మునగ సాగు, వెదురు సాగు, చేపల పెంపకం, పుట్టగొడుగులు, సెరికల్చర్ వంటి విభిన్న వ్యవసాయ కార్యకలాపాలను పరిశీలించి, అనుసరించాలి. ఇది రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఉపాధిని పెంచే మార్గం కూడా అవుతుంది. మన గ్రామాల్లో అభివృద్ధి దిశగా తీసుకునే కీలక అడుగు ఇదే అవుతుంది కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.