28-07-2025 11:11:35 PM
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి..
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్..
మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడంతో సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్(SFI State President Shanigarapu Rajinikanth) అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ వర్క్ షాప్ నకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అసలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు, ఎస్ఎంహెచ్ కళాశాలల హాస్టల్స్ కి సొంత భవనలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
మధ్య తరగతి కుటుంబ విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్ తీసుకుందామంటే ప్రైవేటు కాలేజీ యజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాగం శ్రీకాంత్, ఈదునూరి అభినవ్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ రత్నవేణి, జిల్లా సహాయ కార్యదర్శి నిఖిల్, నస్పూర్ మండల నాయకులు ప్రతీక్, సాయి కృష్ణ, రాంచరణ్, అమోగ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.