28-07-2025 11:17:49 PM
దోమకొండ కుంటలో రెండు మృతదేహాలు లభ్యం..
కుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి..
పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు..
మృతులు అక్క, చెల్లెలు..
కామారెడ్డి (విజయక్రాంతి): కుంటలో బట్టలు ఉతడానికి వెళ్లిన అక్క, చెల్లెల్లు ప్రమాదవశాత్తు ఒకరు ముందు పడడంతో ఆమెను రక్షించేందుకు మరొకరు వెళ్లి ఇద్దరూ మృత్యువాత పడిన సంఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దోమకొండకు చెందిన గోసంగి కులానికి చెందిన పెద్ద రాగుల శివాని(23), ఆమె చెల్లెలు చిన్న రాగుల మల్లవ్వలు బట్టలు ఉతకడానికి సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న నరసింగ రాయకుంటలోకి ఆదివారం సాయంత్రం వెళ్లారు.
బట్టలు ఉతుకుతుండగా పెద్ద కూతురు శివాని నీటిలో పడడంతో ఆమెను రక్షించేందుకు చిన్న కూతురు మల్లవ్వ కుంటలోకి వెళ్లి మృత్యువాత పడ్డారని తండ్రి గంగారపు మల్లేష్ దోమకొండ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దోమకొండ ఎస్సై స్రవంతి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కుంటలోకి వెళ్లి కుంటలో శవాలుగా మారిన శివాని, మల్లవ్వల మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకరిని రక్షించ బోయి మరొకరు మృతి చెందినట్లుగా భావిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.