28-07-2025 11:25:08 PM
చౌటుప్పల్ (విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపాలిటీ(Choutuppal Municipality)లోనీ చినకొండూర్ రోడ్ సమీపంలోని మసీదు వద్ద 26వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో 4 లక్ష రూపాయలు నగదు చోరీకి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు వీరగంధం శ్రీనివాస్ తన కారులో ఉంచిన నగదును దుండగుడు శివ అలియాస్ పుల్లారావు అపహరించాడని తెలపడంతో కేసు దర్యాప్తులో భాగంగా, సీఐ మన్మథ కుమార్ ఆధ్వర్యంలో 28వ తేదీన ఉదయం ధర్మోజిగూడ గ్రామం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీల్లో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. నిందితులు వేముల పుల్లారావు , శివ, కర్వాల సునీల్ కుమార్, మిద్దే జగదీష్ బాబు లు కాగా, మరో నిందితుడు బతుల సాంబ శివారావు పరారీ ఉన్నాడు.
వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వీరి వద్ద నుండి రూ.4 లక్షల నగదు, 5 గ్రాముల బంగారు బిస్కెట్, మొబైల్స్, మొబైల్ నంబర్లు, అద్దెకు తీసుకున్న వాహనం మరియు ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నారు.నిందితులు గతంలోనూ నకిలీ నోట్ల ముఠాలు, నకిలీ బంగారం కేసులలో అరెస్ట్ అయినట్టు విచారణలో వెల్లడైంది. చోరీ జరిగిన నగదు మొత్తం తిరిగి రికవరీ చేయడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఘటన జరిగిన 24 గంటల లోపే నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.