12-08-2025 07:38:29 PM
జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్..
సత్తుపల్లి డివిజన్లో పర్యటించిన జిల్లా అటవీ శాఖ అధికారి..
ఖమ్మం (విజయక్రాంతి): విఎస్ఎస్ సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం పశుపోషణ(గేదెలు, మేకలు), తేనెటీగ పెంపకం, ట్రాక్టర్, ఆటో వంటి వనరులు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్(Forest Department Officer Siddharth Vikram) అన్నారు. మంగళవారం ఆయన సత్తుపల్లి డివిజన్ పరిధిలోని సత్తుపల్లి రేంజ్ కార్యాలయం, చంద్రయ్యపాలెం గ్రామాన్ని సందర్శించి పలు పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విఎస్ఎస్ సభ్యులతో అటవీ సంరక్షణ, అక్రమ తవ్వకాల నివారణ, వన్యప్రాణి రక్షణ, గ్రామ అటవీ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. అడవిలో అక్రమ పోడు సాగు జరిగితే చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ రహదారి మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం సిబ్బంది క్వార్టర్స్, గెస్ట్ హౌస్ నిర్వహణ పనులను సమీక్షించారు. వాహన పార్కింగ్ ప్రదేశాన్ని మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. చంద్రయ్యపాలెం గ్రామ ఎంపీపీఎస్ పాఠశాల అంగన్వాడీలను పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యాలు, పర్యావరణ అవగాహన కార్యక్రమాలు, పాఠశాల ప్రాంగణంలో వృక్షార్పణ పై తగు సూచనలు ఇచ్చారు. కంటైనర్ హాస్పిటల్ సందర్శించి గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించి, డాక్టర్ ప్రతిరోజూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదాల నివారణ, మానిటరింగ్ వ్యవస్థ, పహారా సిబ్బంది సౌకర్యాలను పరిశీలించి, అవసరమైన మెరుగుదలపై సూచనలు ఇచ్చారు.