29-07-2025 12:48:45 AM
అర్మూర్, జులై 28 (విజయ క్రాంతి) : త్వరలో రానున్న వినాయక చవితి ఉత్సవాలకు జిల్లా సి.పి. ఆదేశాల మేరకు డి.జె.లను నిషేధించినట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో డీజే సౌండ్ సిస్టం యాజమాను లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు డిజె సౌండ్ సిస్టం లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నడపరాదని తెలియజేశారు.
వినాయక మండపాలు పెట్టేవారు డి.జె.ల కోసం మీకేమైనా అడ్వాన్సుగా బుకింగ్ చేసుకుంటే వాటిని వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిప్రపత్తులతో నిర్వహించాలి కానీ అధిక ధ్వని డిజె సౌండ్ సిస్టం ఏర్పాటు చేసి ప్రజలకు, వృద్ధులకు విఘాతం కల్పించకూడదని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.