calender_icon.png 21 May, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు బీఆర్‌ఎస్‌ను నమ్ముతారా?

28-11-2024 12:00:00 AM

పది సంవత్సరాల పాటు కుటుంబ నిరంకుశ దోపిడీ పాలన ద్వారా వివిధ సామాజిక వర్గాలను, అణచివేతకు గురిచేసి అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ ఆధినాయకత్వం, కుటుంబ సభ్యులు, వారి అనుచరులు ఇటీవలి కాలంలో వెనుకబడిన కులాలపట్ల అపారమైన ప్రేమ ఒలకబోస్తున్నారు. ఒక్క కుటుంబమే అన్ని ముఖ్య పదవులు అనుభవించి, అభివృద్ధి రంగాలను ముఖ్యంగా విద్య, వైద్య, ఉపాధి వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘన కీర్తి వారిది. 

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ముందు  కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం సమగ్ర కులజనగణన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తూ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్, దాని ఆధినాయకత్వం తమ పూర్తి మద్దతు తెలుపుతారని ప్రజలు ఆశించారు. మరో జాతీ య పార్టీ బీజేపీ జనాభా లెక్కలే చేయని సందర్భంలో ఇక కులగణన ప్రక్రియను సమర్థిస్తుందని ఎవరూ ఆశించలేరు. 

బీఆర్‌ఎస్‌కు చెందిన వెనుకబడిన కులాల నాయకులు ఇటీవల అక్కడక్కడ సభలు నిర్వహించి తమ గళం విప్పి బీసీలకు తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేయడం ప్రజలు గమనిస్తున్నారు. ఈ నాయకులు మాట్లాడడానికి ఆధినాయకత్వం అనుమతి పొందారో లేదో తెలియదు. కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఎలాంటి ఆసక్తి చూపని పరిస్థితిని ఆ వర్గాలు అనుభవించాయి, నష్టపోయాయి. 

చైతన్యమవుతున్న బీసీలు

రాష్ట్ర జనాభాలో ఒక్క శాతం కూడా లేని సామాజిక వర్గం నుండి వచ్చిన బీఆర్‌ఎస్ నాయకత్వం వారి కుటుంబ పాలనలో 52శాతం ఉన్న ప్రజలను అన్ని రంగాలలో అణచివేసి వారి అభివృద్ధిని అడ్డుకోవడం జరిగిందని చెప్పడానికి అనేక ప్రత్యక్ష, పరోక్ష సాక్ష్యాధారాలు ఏకరువు పెట్టవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో  వెనుకబడిన కులాల వారికి ఒరిగిందేమీ లేదని అన్ని పార్టీలకు, నాయకులకు తెలిసిందే.

తమకు జరుగుతున్న అన్యాయం బాధిత ప్రజలకు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నందుకు సం తోషించాలి. దానికి సంబంధించిన చర్చ లు కూడా ఈ వర్గాలలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇకముందు వెనుకబడిన కులాల ప్రజల ఓట్లే లక్ష్యంగా కాం గ్రెస్, బీజేపీవంటి జాతీయ పార్టీలతో పాటు కేసీఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితి బహుజన వర్గాల ఓట్లు లేకుండా అధికారం చేపట్టడం సాధ్యం కాదని తేలిపో యింది.

అందుకే ఇప్పుడు వెనుకబడిన కు లాల సామాజిక న్యాయం కల్వకుంట్ల కు టుంబానికి అవసరమైనట్లుంది. వెనుకబడిన కులాల ప్రజలు రాజకీయ, ఆర్థిక, సా మాజిక అభివృద్ధి రంగాలలో తగిన ప్రా ధాన్యత లభించక రోజు రోజుకు ఆర్థిక సం క్షోభంలో చిక్కుకు పోతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సామాజిక వర్గాలలో తమకు జ రుగుతున్న అన్యాయం గురించిన చైతన్యపూరితమైన చర్చలు ప్రారంభమైనాయి. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలకు అధికారం పొందడానికి బీసీల ఓట్లు ఏదో ఒక విధంగా సాధించడం తప్పనిసరి.   

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కులగణన, బడుగు, బలహీన వర్గాల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎన్నికలలో నినాదం ఇవ్వడం జరిగింది. ఈ నినాదం బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీకి కూడా మింగుడు పడని మాత్రగా పరిణామం చెందవచ్చు. సామాజిక న్యాయం తమ లక్ష్యమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన నిజాయితీని నిరూపించుకోవలసిన అవసరం ఉంది.

కేవలం కులగణన మాత్రమే సామాజిక న్యాయం సమకూర్చదు.ఇక పూర్తిగా కుటుంబ ఆధిపత్యంలో నడుస్తున్న ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌కు కులగణన, బహుజన వర్గాల రాజకీయ సాధికారికత అస్సలే గిట్టని పదార్థం.  అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకత్వం ఈ సామాజిక వర్గాన్ని మరోసారి మభ్య పెట్టడానికి తమ పార్టీ బీసీ నాయకులను రంగంలో దించి ప్రస్తుత ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, అణచివేతల గురించి విస్తృతంగా చర్చలు, సభలు నిర్వహించడం ప్రజలను ఆశ్చర్య పరుస్తున్నది.

ఇంటిపార్టీగా మారిన టీఆర్‌ఎస్

 తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను తన సొంత ఇంటి పార్టీగా ప్రకటించుకున్నారు. దళితులకు ఇస్తానన్న ముఖ్యమంత్రి పదవి తానే తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవినీ తానే తీసుకున్నారు. అదనంగా ఏ అనుభవం లేని తన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. తన కొడుకుతో సహా మేనల్లుడిని, సహచర బంధువును క్యాబినెట్‌లో చేర్చుకొని కీలకమైన శాఖలు అప్పగించారు.

18 మంది ఉన్న క్యాబినెట్‌లో కుటుంబ సభ్యు లు నలుగురిని చేర్చుకున్నారు. బిడ్డకు, ఇంకొక బంధువుకు, మరదలు కొడుకుకు రాజ్యసభ, లోక్‌సభ సీటు,్ల ప్లానింగ్ బోర్డు వైస్‌చైర్మన్ పదవులు పంచి పెట్టారు.50 శాతానికి పైగా ఉన్న బీసీలకు మాత్రం సంక్షేమ, ఆరోగ్య, ఎక్సైజ్ లాంటి మూడు నామమాత్ర మంత్రిత్వ శాఖలు ఇచ్చి మొండిచేయి చూపించారు. నాలుగు లక్షలమంది ఉద్యోగులను ఉపయోగించి ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ప్రజలకు అనేక ఆశలు కల్పించారు.

కానీ ఆ నివేదికను తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకున్న ఘన చరిత్ర వారిది. స్థానిక సంస్థలలోనైనా అప్పటికి ఉన్న 33శాతం రిజర్వేషన్లను బీసీ ప్రజలకు దక్కకుండా చేసి 22 శాతానికి తగ్గించడం జరిగింది.  ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ఏకంగా బీసీ నాయకుడినని చెప్పుకునే ప్రధాని మోడీ తెచ్చిన చట్టం ప్రకారం 10శాతం ఈడబ్ల్యూఎస్ ఉద్యోగాలు కల్పించే జీవో మాత్రం తెలంగాణలో వెంటనే అమలు చేశారు.

బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం అమలు చేయకుండా చేసి లక్షలాది విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక విద్యను దూరం చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న ఐదులక్షల మంది నిరుద్యోగ యువతకు నిరాశే మిగిల్చారు.

కేసీఆర్ తన సామాజిక వర్గానికి, బంధువులకు అత్యధిక సంఖ్యలో ఉన్నత పదవులు, వేలకోట్ల నిధులు కేటాయించి, ప్రాజెక్టులు, కార్పొరేట్ వ్యాపారా లు అప్పగించి రుణం తీర్చుకున్నారు. కానీ తెలంగాణ కొరకు త్యాగాలు చేసిన బహుజన వర్గాల యువత, ప్రజలను తమ సహజ ధోరణిలో అణచి వేయడం జరిగిందని గమనించిన ఓటర్లు ఇటీవలి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. 

ప్రస్తుతం తిరిగి అధికారం పొందడానికి అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాలను ప్రసన్నం చేసుకుని ఓట్లను సమీకరించుకోవడానికి తన కొడుకును, అల్లుడిని, బిడ్డను, మరి కొంతమంది నాయకులను రంగంలో దించి ప్రజలను నమ్మించే ప్రయత్నం మొదలుపెట్టారు. కల్వకుంట్ల కవిత కూడా సామాజిక న్యాయం కొరకు పోరాడుతానని చెప్పడం హాస్యాస్పదం.

మోసపోయి అన్ని రకాల అణచివేతకు గురైన వెనుకబడిన కులాల ప్రజలు తమ ఆస్తిత్వం కొరకు పోరాడడానికి సిద్ధపడ్డారే కానీ నయవంచకులను నమ్మడానికి సిద్ధంగా లేరు.

 నమ్మే స్థితిలో లేని జనాలు 

 ఇకముందు రాబోయే సాధారణ ఎన్నికల్లో  సామాజిక న్యాయంతో  పాటు వివిధ పార్టీల ఆచరణాత్మక వైఖరి, గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అణగారిన ప్రజలు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని వేరే చెప్పనవసరం లేదు. 

పక్కా  కుటుంబ ఆధిపత్య పార్టీగా అవతరించిన బీఆర్‌ఎస్ 52 శాతం జనాభా ఉన్న బీసీ కులాలకు తీవ్ర అన్యాయం చేసి ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని కొత్త నినాదంతో వస్తే తెలంగాణ బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు. చైతన్యవంతులైన బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇలాంటి శక్తుల పట్ల కనీసం ఇప్పుడైనా మెలకువతో ఉండాల్సిన అవసరం గుర్తించాలి. 

ప్రొ.కూరపాటి వెంకట్ నారాయణ