08-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కొంత మంది కుమారులు, కూతుళ్లు.. తమ ను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన కన్నవారిని పట్టించుకోవడం లేదు. ఆస్తులు తీసుకుని తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇసుమం తైన ప్రేమ, మానవత్వం చూపకుండా ఇంటి నుంచి బయటికి కొంతమంది గెంటేస్తుంటే, మరికొంతమందేమో వారి బాగోగులు పట్టించుకోవడంలేదు.
దీంతో చివరి మజిలీలో వృద్ధ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే తల్లిదండ్రులను ప ట్టించుకోని వారిలో ప్రభుత్వ ఉద్యోగులూ ఉంటున్నారు. ఇలాంటి వారి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విధానాన్ని తీసుకోరాబోతున్నారు. వృద్ధులకు అండగా ఉండే లా వారి ఖాతాల్లో వేతనాల నుంచి కొంత మొత్తాన్ని జమచేసేలా చర్యలు చేపట్టనున్నారు.
ఇటీవల జరిగిన మహిళా, శిశు, ది వ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖలపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసు కున్న విష యం తెలిసిందే.
అక్కడ తల్లిదండ్రుల కోసం ప్రత్యేక సెలవులు..
కుటుంబ విలువలను మెరుగుపరచే దిశగా అస్సాం ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కీలక విధానాన్ని అమలు చేస్తోంది. తల్లిదండ్రులతో గడపాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏడాది రెండు రోజులు ప్రత్యేక సెలవులను అందిస్తోంది. వృద్ధులతో మానసిక, భావోద్వేగ బంధాన్ని పెంచేందుకు అక్కడి ప్రభుత్వం.
ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రెండు రోజులే కాకుండా అదనంగా మరో ఒకటి లేదా రెండు రోజులు సెలవులు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. మనదగ్గర కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఉద్యోగ, ఉపాధ్యా యుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అస్సాం రాష్ట్రంలో..
అయితే ఈ విధానం అస్సాం రాష్ట్రంలో అమలవుతోంది. అక్కడ ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో కొంత డబ్బులు జమచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మన దగ్గర కూడా అదే విధానాన్ని అమలు చేసి ఉద్యోగుల వేతనాల నుంచి నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాలకు 10 శాతం జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఈ తరహా నూతన విధానం అస్సాం రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమలైతే అక్కడ అధ్యయనం చేసి మన దగ్గర దాన్ని అమలు చేసేలా ఓ నివేదికను రూపొందించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ ఏ రాష్ట్రాల్లో ఈతరహా విధానం అమలవుతుందో చూసి ప్రత్యేక బృందాలుగా వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.
మంచి నిర్ణయమే: బీ.శ్యామ్, టీజీవో అసోసియేట్ ప్రెసిడెంట్
తల్లిదండ్రుల విషయంలో ప్రభుత్వం తీసుకున్నది మంచి నిర్ణయమే. ఉద్యోగుల వేతనాల నుంచి కొంత డబ్బులు వృద్ధుల ఖాతాల్లో జమ చేయాల్సిందే. ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారు కొంతమంది వేరే వాళ్ల ముందు వారు తమ తల్లిదండ్రులని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. తల్లిదండ్రుల త్యాగంతోనే మనం ఈస్థాయికి వచ్చామని మరిచిపోవద్దు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే.
ఆర్థికంగానైనా చేయూత ఇచ్చినట్లుంటుంది: కే.రమేశ్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు
తల్లిదండ్రులను పట్టించుకోని ఘటనలు ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం సరైనదే. వృద్ధులకు సంబంధించి ఎన్నో చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. కనీసం ఇలా ఆర్థికంగానైనా వారికి భరోసా ఇచ్చిన వాళ్లమవుతాము. ఉద్యోగుల జీతాల నుంచి వారి ఖాతాల్లో జమచేయడం మంచి ఆలోచనే.