08-07-2025 01:58:40 PM
అమరావతి: మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(Kovur MLA Vemireddy Prashanthi Reddy)పై వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(Former YSRCP MLA Nallapureddy Prasanna Kumar Reddy) చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలనిపేర్కొన్నారు.
కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతి రెడ్డిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని దుయ్యబట్టారు. ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందని, వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని పవన్ చెప్పారు.
ప్రశాంతి రెడ్డిపైనా, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిపైనా సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయని అన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో 2024 ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని హేళన చేశారు. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారని విరుచుకుపడ్డారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు.