calender_icon.png 8 July, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం

08-07-2025 12:00:00 AM

- పెండింగ్ ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని పీడీఎస్‌యూ ఆందోళన

- సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమన్న విద్యార్థి నేతలు

- పోలీసులకు, విద్యార్థులకు వాగ్వాదం, తోపులాట

- నిరసనకారుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి):విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణ మే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్(పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో చేపట్టిన ముఖ్యమంత్రి నివాస ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.

సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందు కు యత్నించిన పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. రాష్ర్టంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పేరుకుపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపించారు.

దీనికి తోడు పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ వారు ఆందోళనకు పిలుపునిచ్చారు.  

ఇందులో భాగంగా, పీడీఎస్‌యూ కార్యకర్తలు సీఎం నివాసం వద్దకు చేరుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘సీఎం డౌన్ డౌన్.. ’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకుని అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని నిరసనకారులను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

ఈ క్రమంలో విద్యా ర్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను బలవంతంగా అరెస్టు చేసి, వాహనాల్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం ఆపబోమని విద్యార్థి నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.