భక్తులకు ఇబ్బందులు కలగనీయొద్దు
- అన్ని ఏర్పాట్లు చేయాలి
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్
సరస్వతి అంత్య పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ
మహబూబాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): సరస్వతి అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరిలతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ సరస్వతి ఘాట్, మ్యూజియాన్ని పరిశీలించారు.అనంతరం ఈఓ కార్యాలయంలో దేవాదాయ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఇంజినీరింగ్, విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య, ఆర్టీసీ అధికారులతో శాశ్వత, తాత్కాలిక పనులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా శాఖల వారిగా చేపట్టిన శాశ్వత, తాత్కాలిక పనులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ మాట్లాడుతూ సరస్వతి పుష్కరాల్లో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా ఉండాలని ఎలాంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని, 540 మరుగు దొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మే మొదటివారంలో పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
కాళేశ్వర మహత్యంపై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పుస్తకాలు ప్రచురణ చేయాలన్నారు. పీఠాధిపతులచే యాగం కార్యక్రమాలు నిర్వహించాలని షెడ్యూల్ తయారు చేయాలని,ఆహ్వాన పత్రికలు తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.




