calender_icon.png 26 October, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కావాలా? ఆటవిక రాజ్యమా?

26-10-2025 12:14:08 AM

  1. ఆర్జేడీ పాలనలో దోపిడీరాజ్యంగా బీహార్ 
  2. ఆ పార్టీకి అధికారం కట్టబెట్టొద్దు..
  3. ఎన్డీయే కూటమితోనే సుపరిపాలన
  4. మేం అధికారంలోకి వస్తే చొరబాటుదారులను గుర్తిస్తాం
  5. వారిని వారి సొంత దేశాలకు తరలిస్తాం
  6. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా

పాట్నా, అక్టోబర్ 25: ‘జేడీయూ అధినేత నితీశ్ సీఎం అయిన తర్వాత ఎన్డీయే ప్రభుత్వం కలిసి చేపట్టే అభివృద్ధి కావాలా? రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పాలనలో మళ్లీ కిడ్నాప్‌లు, బెదిరింపులు, దోపిడీ, అవినీతి రాజ్యం, ఆటవిక పాలన కావాలా ?’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. బీహార్‌లోని నలంద జిల్లా బీహార్‌షరీఫ్, ముంగేర్‌లో శనివారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేవలం తన కుటుంబ ప్రయోజనాలనే చూసుకున్నారని, ప్రజల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్జేడీ పాలించిన రోజుల్లో పారిశ్రామిక రంగం కుదేలయిందని, రాష్ట్రవ్యాప్తంగా వందలాది పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగిత పెరిగిందని అభిప్రాయపడ్డారు. నాడు మాఫియా ముఠాలు కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడేవని ధ్వజమెత్తారు.

ప్రజల ఆస్తులను కబ్జా చేసేవని, విలువైన వస్తువులను దోపిడీ చేసేవని నిప్పులు చెరిగారు. ఎన్డీయే వచ్చిన తర్వాతే బీహార్ నక్సల్ విముక్త రాష్ట్రమైందని పేర్కొన్నారు. సీఎంగా నితీశ్‌కుమార్ సుపరిపాలన అందించడంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతల సమస్య కారణంగా ఒకప్పుడు రాష్ట్రంలో అనే విడతల్లో పోలింగ్ జరిగేదని, ఇప్పుడు కేవలం రెండు దశల్లోనే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసే ప్రశాంత వాతావరణం వచ్చిందని కొనియాడారు.

రాష్ట్రంలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఒక్క దశలోనే జరుగుతాయని జోస్యం చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు పాండవుల్లా ఐకమత్యంగా ఉండి, ఉమ్మడి లక్ష్యంతో ఎన్నికల్లో పోరాడుతున్నాయని, కానీ.. ‘మహాఘట్బంధన్’కు మాత్రం ఎలాంటి దశ దిశ లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఒక మంత్రినో, ఒక ముఖ్యమంత్రినో ఎన్నుకునే ఎన్నిక కాదని, బీహార్ నుంచి ఆర్జేడీ ఆటవిక రాజ్యం రాకుండా అడ్డుకోవడానికి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ చేపడితే, కాంగ్రెస్ పెద్దలు దానిని వ్యతిరేకించారని మండిపడ్డారు. ఏఐసీసీ అగ్రనేత చొరబాటుదారులకు అండగా నిలవాలని చూస్తున్నారని, కానీ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో చొరబాటుదారుడిని గుర్తించి, వారి స్వదేశానికి తరలిస్తామని ప్రకటించారు. చొరబాటుదారులను వారి దేశాలకు పంపకుండా ఏ శక్తీ ఆపలేదని నొక్కిచెప్పారు.