calender_icon.png 11 July, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంతెనలు కావొద్దు.. యమపాశాలు!

11-07-2025 12:22:20 AM

మేకల ఎల్లయ్య :

భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మనం గొప్పగా చెప్పుకొంటున్నాం. కొత్త రహదారులు, ఆకాశాన్ని తాకే భవంతులు, ఆధునిక వంతెనలతో దేశ ముఖచిత్రం మారిపోతున్నదని సంబురపడుతున్నాం. కానీ, వేగవంతమైన ప్రగతి వెనక, నాణ్యత లేని నిర్మాణాలు, నిర్వహణకు నోచుకోని వంతెనలు నిశ్శబ్దంగా ప్రజల ప్రాణాలను బలి గొంటున్నాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై పాత వంతెన ఉన్నట్టుండి కుప్పకూలింది.

వంతెనపై వెళ్తున్న వాహనాలు అమాంతం నదిలో పడ్డాయి. గతంలో తెలంగాణలో నిర్మాణ దశలో ఉన్న మానేరు వంతెన, శతాబ్దాల చరిత ఉన్న వేములవాడ వంతెన కూలాయి. ఈ ఘటనలు నిజానికి చేదు అనుభవాలు. వంతెనలపై మృత్యువీచికలు ఇంకెన్నాళ్లు? ఇటీవల వడోదరలో కూలిన వంతెన దాదాపు నాలుగు దశాబ్దాల పాతది. ఇలాంటి వంతెనలు వాటి జీవితకాలం ముగిసిన తర్వాత, సరైన నిర్వహణ లేకపోతే కూలిపోవడం సహజం.

అయితే.. ప్రభుత్వాలు అలాంటి వంతెనల నుంచి ప్రజల ప్రాణాలను ఎలా కాపాడతాయనేదే ప్రశ్న. దేశంలో వంతెనలు కూలడం లేదా పాడవటానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైనది నిర్వహణ లోపం. రెండోది వాటి నిర్వహణకు ప్రభుత్వాలు తగిన నిధులు కేటా యించకపోవడం. మూడోది వంతెనల పటుత్వాన్ని చెక్ చేయాల్సిన ఇంజినీర్లు మిన్నకుండటం. వాస్తవానికి పాత వంతెనలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయా ల్సి ఉంటుంది.

లేకపోతే మొత్తం వంతెన బలహీనపడుతుంది. వంతెనలు కూలడానికి మరో ప్రధాన కారణం.. నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టడం. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, తక్కువ నాణ్యత గల పదార్థాలను ఉపయోగించడం వంటివి వంతెనల జీవితకాలాన్ని తగ్గిస్తాయి. వంతెనలపై ప్రతిరోజూ వందలాది వాహనాలు వెళ్తాయి. రాష్ట్రాలను, జిల్లాలను కలిపే వంతెనలపై అధిక లోడ్ తో వెళ్లే వాహనాలు ఎక్కువగా ఉంటాయి.

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు వంతెనలు నిర్మాణం చేపడితే బాగుంటుంది. కొన్నిసార్లు ఆ వంతెనలపె,ై వాటి సామర్థ్యానికి మించి లోడ్ తీసుకెళ్లే వాహనాలు కూడా ప్రయాణిస్తాయి. వాటి రాకపోకలను నియంత్రించే సరైన వ్యవస్థ లేకపోవడమూ ప్రమాదాలకు కారణం. అలాగే ఎడతెరిపి లేకుండా కురిసే భారీ వర్షాలు, వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంతెనలు కూలడానికి కారణం. 

2011- 23 మధ్య ప్రమాదాలు.. 

2011లో బీహార్‌లోని కోసీ నదిపై ఉన్న ఒక పాత వంతెన కూలింది. 2012లో పశ్చి మ బెంగాల్‌లోని ఒక వంతెన కూలి కొంద రి ప్రాణాలను బలితీసుకున్నది. 2016లో మహారాష్ట్రలోని మహాడ్ వద్ద సావిత్రి నదిపై పాత వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రమాదంలో పలువురు మృతిచెందారు. 2017లో ముంబైలో అంధేరీ రైల్వే స్టేషన్ సమీపంలోని పాదచారుల వంతెన కూలి పలువురు గాయపడ్డారు.

2018లో పశ్చి మ బెంగాల్‌లోని మజెరత్ వంతెన కూలి ముగ్గురు మరణించారు. 2019లో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లోని గండక్ నదిపై నిర్మించి వంతెన కూలింది. 2022లో గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలి వంద మందికి పైగా మరణించారు. ఇది ఆ రాష్ట్రంలోనే పాత వంతెన. నిర్వహణ లోపం సరిగా లేకపోవడం వల్లనే ప్రమా దం సంభవించింది.

2023లో బీహార్‌లో సుల్తాన్‌గంజ్- అగువానీ ఘాట్ వంతెన కూలిపోయిన ఘటన నిర్మాణంలో ఉన్న వంతెనల నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తిం ది. ఈ ప్రమాదాలన్నీ కలిపి మృతుల సంఖ్య కచ్చితంగా వేలల్లో ఉంటుందని అంచనా. కానీ, ఆయా ప్రభుత్వాలు ప్రమాదాల తీవ్రతను, మృతుల సంఖ్యను కచ్చితంగా చెప్పిన దాఖలా లేదు.

తెలుగు రాష్ట్రాల్లోనూ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొన్ని వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నా యి. పెద్ద ఎత్తున వంతెనలు కూలిపోయిన సంఘటనలు తక్కువగా ఉన్నప్పటికీ, చిన్నపాటి నష్టాలు, మరమ్మతులు అవసరమైన వంతెనలు అనేకం ఉన్నాయి. తెలంగాణ లో ఇటీవల కాలంలో రెండు వంతెన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి.. 2024 ఏప్రిల్‌లో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామం వద్ద మానేరు వాగుపై నిర్మాణ దశలో ఉన్న వంతెన కూలిన ఘటన.

ప్రమాదంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. రూ.49 కోట్ల అంచనాతో 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పను లు ఎనిమిదేండ్లు గడిచినా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ నాణ్యాత ప్రమాణాలు పాటించకపోవడం, అధికారులు నాణ్య తాపరమైన అంశాలను పెద్దగా తనిఖీ చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందనేది సుస్పష్టం.

ఆ తర్వాత 2023 సెప్టెం బర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రము ఖ పుణ్యక్షేత్రం వేములవాడలో శతాబ్దాల నాటి ఒక కమాన్ బ్రిడ్జి కూలింది. ఘటన లో పది మందికి పైగా స్థానికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఇప్ప టికీ కేవలం మంచానికే పరిమితమై ఉన్న పరిస్థితి. వంతెన కూలిన సమయంలో దానిపై నుంచి వెళ్తున్న ఓ లారీ కూరగాయల మార్కెట్‌లోకి దూసుకెళ్లడంతో నష్ట తీవ్రత పెరిగింది.

ఈ వంతెన వంద సంవత్సరాలకు పైగా పాతదని, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే కూలిపోయిందని స్థానికులు నాడు ఆందోళన చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా అనేక పాత వంతెనలు ఉన్నాయి. ముఖ్యంగా తీరప్రాంతంలో, నదులపై ఉన్న వంతెనలు తుఫానులు, వరదల కారణంగా బీటలు వారుతున్నాయి.

గతంలో ప్రకాశం బ్యారేజీ ప్రాంతంలో ప్రభుత్వాలు అనేక మరమ్మతులు చేపట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వంతెనలు కూలి భారీ ప్రాణనష్టం జరిగిన సంఘటనలు పెద్దగా నమోదు కానప్పటికీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ముందు మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

భవిష్యత్‌కు భద్రత లేదా ?

వంతెన ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిథిలావస్థలో ఉన్న పాత వంతెనలను కూల్చివేయాలి. కొత్తగా వంతెనల పటిష్టతపై ఎప్పటికప్పు డు తనిఖీలు చేయాలి. అందుకు పురాతన పద్ధతులు కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. శిథిలావస్థకు చేరిన వంతెనలను గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలి.

ఆ వైపు వాహనాలను మరో వైపునకు మళ్లించాలి. అలాగే ప్రభుత్వాలు కేవలం వంతెనలు నిర్మించాం.. ఇక మా పని అయిపోయింద ని చేతులు దులిపేసుకోకుండా.. నిర్వహణకు కూడా తగినన్ని నిధులు కేటాయిం చాలి. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించేలా చూడాలి. నిఘా వ్యవస్థ ను పటిష్టం చేయాలి. నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలి.

నాసిరకం పను లు చేసే కాంట్రాక్ట్ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. నిర్మాణ రంగంలో అవినీతిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. పారదర్శకతను పెంచాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా, ఏదైనా వంతెన ప్రమాదకరంగా కనిపిస్తే, ప్రజలు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వంతెనల పర్యవేక్షణకు డ్రోన్లు, సెన్సార్లను ఉపయోగించాలి.

తాజాగా గుజరాత్‌లోని వడోదర వంతెన ప్రమాదం, మోర్బీ ఘటన, అలాగే తెలంగాణలోని మానేరు, వేములవాడ వంతెన ప్రమాదాలు భారతదేశ మౌలిక సదుపాయాల భద్రతకు ఒక హెచ్చరిక. మానవ ప్రాణాలు అత్యంత విలువైనవి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, అధికారులపై ఉంది.

ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడంతో సరిపెట్టుకోకుండా, ప్రమాదానికి గల కారణాలు గుర్తించాలి.  భవిష్యత్తులో ప్రమాదాలకు తావు లేకుండా చూడాలి. లేదంటే అవి  ప్రాణాలు తీసే నిర్మాణాలవుతాయి. 

 వ్యాసకర్త సెల్: 99121 78129