calender_icon.png 27 July, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెగెటివిటీ ప్రచారం చేస్తే ఉపేక్షించొద్దు

25-07-2025 01:51:33 AM

సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగెటివిటీని తలుచుకొని కుమిలిపోవద్దని పవన్ కల్యాణ్ అభిమానులు సూచించారు. ‘నెగెటివిటీ ప్రచారం చేస్తున్నవారిపై సున్నితంగా ఉండకండి. తిరిగి దాడి చేయండి’ అని పిలుపునిచ్చారు. ‘ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. దీన్ని మేము కరెక్ట్ చేస్తున్నాం. కానీ, దీనిపై నెగెటివిటీ ప్రచారం చేస్తే మాత్రం అస్సలు ఉపేక్షించవద్దు’ అని పవన్ పేర్కొన్నారు.

ఈ సినిమా గురువారం విడుదలైన నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కథానాయకుడు పవన్‌కల్యాణ్ పైవిధంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇంకా మాట్లాడు తూ.. “నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. నా జీవితంలో ఏదీ అంత తేలికగా జరగదు. ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

నా 29 ఏళ్ల సినీ ప్రయాణంలో నేను ఒక సినిమాను ఇలా ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. ఏ సినిమాకైనా భావోద్వేగాలు ముఖ్యం. చరిత్రలో మొఘల్స్ గురించే ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. చరిత్ర రాసిన వాళ్లు మన రాజులపైన చిన్నచూపు చూశారు. ఔరంగజేబు పాలన సమయంలో హిందూదేశంలో హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విషయాన్ని ఈ సినిమాలో నిర్భయంగా ప్రస్తావించాం” అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ నిధి అగర్వాల్, చిత్ర సమర్పకుడు ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ, ప్రముఖ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ సినిమాకు సంబంధించి తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. 

వీఎఫ్‌ఎక్స్‌పై వీరమల్లు కీలక నిర్ణయం? 

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజాచిత్రం ‘హరిహర వీరమల్లు’. ఐదేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాపై ఇప్పుడు అంతటా మిశ్రమ స్పందన వస్తోంది. విమర్శనాస్త్రాల నుంచి తప్పించుకునేందుకు మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారన్న టాక్ వినవస్తోంది.

భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడంలో పలు మార్పులు అత్యంత కీలకంగా భావించిందట టీమ్. సెకండాఫ్‌లో వీఎఫ్‌ఎక్స్ ఫిక్స్ చేసి, కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాలని యోచిస్తున్నారట. ఫలితంగా 15 నిమిషాల సీన్లను ట్రిమ్ చేయాలని చేస్తున్నారట. ముఖ్యంగా మొత్తం సినిమాలో అధిక విమర్శలు గుర్రపు స్వారీ సన్నివేశాలు వస్తున్న తరుణంలో ఆ వీఎఫ్‌ఎక్స్‌ను డిలీట్ చేయనున్నట్టు సమాచారం. శుక్రవారం నుంచి అప్‌డేట్ వెర్షన్ స్క్రీనింగ్ చేయనున్నారని సమాచారం. అయితే, ఈ విషయమై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.