25-07-2025 01:53:40 AM
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన యంగ్ బ్యూటీ శ్రీలీల. ఈ చిన్నదానికి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. ‘భగవంత్ కేసరి’ తర్వాత చాలా సినిమాలు చేసినా అవేవీ ఈ ముద్దుగుమ్మను విజయ తీరాలకు చేర్చలేకపోయాయి. ఆ మధ్యలో ‘గుంటూరు కారం’ యావరేజ్‌గానే ఆడింది. కానీ ‘స్కంద’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘రాబిన్‌హుడ్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి.
తాజాగా ‘జూనియర్’లో కొత్త కుర్రాడు కిరీటితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులోని వైరల్ వయ్యారి పాట తప్ప సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఇటీవల టాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలను కాదనుకొని మరీ ఇతర భాషలపై దృష్టి పెడుతోంది. శ్రీలీల కెరీర్‌పై ఇండస్ట్రీలో చర్చలు ప్రారంభయ్యాయి. అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతూ, తన తర్వాతి ప్రాజెక్ట్‌తో గట్టిగా బౌన్స్ బ్యాక్ ఇస్తానని ధీమాతో ఉందట.
ఎందుకంటే పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఇప్పుడు లైనప్‌లో ఉన్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ ఈ అమ్మడే హీరోయిన్. కోలీవుడ్‌లో శివకార్తికేయన్ ‘పరాశక్తి’, బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ ‘ఆషికీ 3’లోనూ నటిస్తోంది.
అన్నీ కలిసొస్తే ‘ఆషికీ3’ సినిమాతో రొమాంటిక్ స్టార్‌గా పేరొస్తుందని భావిస్తోందట శ్రీలీల. ఇక మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో శ్రీలీల పాత్ర.. ఆమె ఎనర్జీ, డాన్స్‌తోపాటు నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని సమాచారం. మరి వీటన్నింటిలో శ్రీలీల సినీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచే సినిమా ఏదో చూడాల్సిందే.