01-11-2025 12:14:49 AM
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, భవిష్యత్తులో వరద ముప్పును నివా రించే లక్ష్యంతో హైడ్రా కార్యాచరణను ము మ్మరం చేసింది. నాలాల్లో పూడిక తీత పను లు ఆపొద్దు, ఎక్కడా నీరు నిలవొద్దు అం టూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నగరంలోని పలు చెరువులు, నాలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాల్లో నాలాల్లో పూడిక తీత పనులను పర్యవేక్షించిన కమిషనర్, వర్షాలు లేని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది పూడిక తీయడం వల్ల భారీ వర్షాలు పడినా పెద్దగా వరద ముప్పు రాలేదు. వచ్చే ఏడాది అసలు సమస్యే తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
కాగా శంషాబాద్ మం డలంలో కమిషనర్ పర్యటిస్తున్న సమయంలో, చిన్న, పెద్ద గోల్కొండ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబో సుకున్నారు. సారూ.. వర్షం పడితే ఔటర్ రింగ్ రోడ్డు అండర్ పాస్లు నీటితో నిండిపోతున్నాయి. మేము ప్రయాణించే ఆర్టీసీ బస్సు నీళ్లలో ఆగిపోవడంతో స్కూల్‌కి వెళ్లలేకపోతున్నాం అంటూ వారు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన కమిషనర్, వరద కాలువల్లో పూడికను తొలగించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల ని అధికారులను ఆదేశించారు.