calender_icon.png 3 August, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలకు వాళ్ల ఫొటోలు వాడొద్దు

02-08-2025 12:00:00 AM

  1. మాజీ సీఎంలు, నాయకుల పేర్లు ఉపయోగించొద్దు
  2. తమిళ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచనలు

చెన్నై, ఆగస్టు 1: తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే ప్రజా సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేత ల పేర్లు వాడొద్దని, పథకాలను ప్రచారం చేసేటపుడు మాజీ ముఖ్యమంత్రుల ఫొటో లు, చిహ్నాలు ఉపయోగించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

స్టాలిన్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఉంగలుడాన్ స్టాలిన్’ (మీతో స్టాలిన్) ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని అన్నాడీఎంకే నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం కోర్టులో సవాల్ చేస్తూ.. ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో సుప్రీం కోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలకు ఇది వ్యతిరేకం అని పిటిషనర్ పేర్కొన్నారు.

‘ఉంగలుడన్ స్టాలి న్’, ‘నలం కాకుం స్టాలిన్ తిట్టం’ పథకాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. ప్రజల సొమ్మును రాజకీయ మైలేజీ కోసం వాడుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్, రాజ్యసభ ఎంపీ విల్సన్ వాదనలు వినిపించారు. ‘ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైంది. అధికార పార్టీ నేతలకు వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక ఈ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధాని పేరు వచ్చేలా ‘నమో’ పేరు పెడుతున్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరిట అమ్మ అనే పథకాలు ఉండేవి. అటువంటప్పుడు స్టాలిన్ పేరుతో పథకం ఉంటే తప్పేంటి?’ అని వాదనలు వినిపించారు. ప్రజాసంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా తాము ఉత్తర్వులు జారీ చేయ డం లేదని.. పథకాల పేర్లలో జీవించి ఉన్న నేతల పేర్లు వాడకూడదని మాత్రమే సూచిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.