రెండంచుల కత్తి
ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూనే ఉన్నారు. అది అక్రమ వలసల అడ్డుకట్ట కావచ్చు, లేదా రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కావచ్చు... తాను అనుకున్న తక్షణం కార్యరంగంలోకి దిగిపోతున్నారు. తాజాగా ప్రతీకార సుంకాల విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకోవడం గమనార్హం.
వాణిజ్య ప్రత్యర్థి చైనాతో పాటుగా మిత్ర దేశంగా భావించే భారత్‌పైన కూడా ఏప్రిల్ 2నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ దేశాలపైనే కాదు, తమ వాణిజ్య భాగస్వాములందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని ఆయన అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. అయితే ట్రంప్ తన రాజకీయ విధానానికి వాణిజ్యాన్ని ఆయుధంగా చేసుకోవడమే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం.
టారిఫ్‌లు కేవలం అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడానికి ఉద్దేశించినవి మాత్రమే కాదు. మన దేశ హృదయాన్ని పరిరక్షించడానికి సంబంధించినవి కూడా’ అని ప్రకటించడం ద్వారా ట్రంప్ అమెరికన్లలో సెంటిమెంట్‌ను మరోసారి రేకెత్తించడానికి యత్నించారు. అయితే ఈ టారిఫ్‌లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని పరిశీలకుల అభిప్రాయం.
తమపై సుంకాల పెంపుపై చైనా స్పందించి తీరే దీనికి నిదర్శనం. ఐరోపా యూనియన్ లాంటి మిగతా దేశాలు కూడా ఇదే రీతిలో స్పందిస్తే దాని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఒకసారి వడ్డీరేట్లలో కోత విధించింది. మరింత తగ్గించే అవకాశమున్నట్లు అంచనా. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో అది పునరాలోచన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ప్రతి దేశం కూడా అమెరికాతో వాణిజ్య లోటు తగ్గిన ప్రభావాన్ని తట్టుకోవడానికి దేశంలో డిమాండ్‌ను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం వస్తుంది. దేశీయ స్టాక్‌మార్కెట్లనుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వైదొలగడం వల్ల ఆ దేశాల మార్కెట్లు కుదేలు అవుతాయి. గత మూడు వారాలుగా భారతీయ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే దీనికి నిదర్శనం.
అయితే ఈ టారిఫ్‌ల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా భారీగానే ప్రభావం చూపించవచ్చు. ఎవరు అవునన్న కాదన్నా అమెరికా కొన్ని వస్తువుల విషయంలో ఇతర దేశాలనుంచి దిగుమతులపై ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది.
ఇక అమెరికా విధించబోయే ప్రతీకార సుంకాల ప్రభావం భారత దేశ ఎగుమతులపైనా తీవ్రంగా ప్రభావం చూపించనుంది. అమెరికానుంచి మనదేశం దిగుమతి చేసుకునే వస్తువులకన్నా మన దేశంనుంచి అమెరికాకు జరిగే ఎగుమతులే ఎక్కువ.
ముఖ్యంగా రసాయనాలు, లోహ ఉత్పత్తులు, వజ్రాలు, ఆభరణాలు, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ టెక్స్‌టైల్ వంటి రంగాలపై ఈ సుంకాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2024లో మన దేశంనుంచి అమెరికాకు మొత్తం ఎగుమతులు దాదాపు 74 బిలియన్ డాలర్ల దాకా ఉన్నాయి. ఈ టారిఫ్‌ల కారణంగా భారత్ ఏటా దాదాపు 7 బిలియన్ డాలర్ల మేర నష్టపోవచ్చని అంచనా.
అయితే ఇప్పటికే టారిఫ్‌ల అంశం చర్చించడానికి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన ఈ విషయంలో ఎంతమేరకు రాయితీలు సంపాదించగలరనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఏడాది చివర్లోగా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునే ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్నారు.
అలాగే బ్రిటన్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. అయినప్పటికీ ట్రంప్ సుంకాల ప్రభావం దేశ ఆర్థిక వృద్ధి రేటుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే టారిఫ్‌ల పెంపుపై ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.






