25 April, 2026 | 3:20 AM

మౌనాన్ని ఛేదిద్దాం

07-03-2025 12:00 AM

ఒంటరితనం కేవలం మనసులో కలిగే భావన మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్యాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్లుహెచ్‌ఓ) ఇటీవల దీన్ని ఒక ప్రధాన గ్లోబల్ ఆరోగ్య సమస్యగా ప్రకటించింది. డబ్లుహెచ్‌ఓ పరిశోధనల ప్రకారం, ఒంటరితనం రోజుకు 15 సిగరెట్లు పొగ తాగినంత హానికరంగా మారింది. దీని ప్రభావం స్థూలకాయం, శారీరక క్రియాహీనత కన్నా అధికమని ఆ సంస్థ నిపుణులు వెల్లడించారు.

ఈ సమస్య పరిష్కారానికి డబ్లుహెచ్‌ఓ అంతర్జాతీయంగా అన్ని వయసుల వారికీ సామాజిక అనుసంధానాన్ని పెంపొందించే కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెబుతూ అందుకోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. డబ్లుహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డా. టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసస్ నేతృత్వంలో ఈ కమిషన్ ఒంటరితనాన్ని తగ్గించే కార్యాచరణను రూపొందిస్తోంది.

ఒంటరితనం శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపడం దురదృష్టకరం. పరిశోధనల మేరకు, ఒంట రితనం డిమెన్షియా ముప్పును 50 శాతం పెంచుతుందని, గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ముప్పును 30 శాతం పెం చుతుందని వెల్లడైంది. ఇంకా నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నొప్పులు, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యా ఆలోచనలు పెరగడం వంటి సమస్యలకూ దారి తీస్తోంది.

వృద్ధులలోనే ఇది తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతోంది. యవతలోనూ ఒంటరితనం పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 5 నుంచి 15 శాతం మంది టీనేజర్లు దీని బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి వ్యక్తిగత, సామాజిక స్థాయిలో చర్యలు తీసుకోవాలి.

ఇష్టమైన పనులు చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను పెంచుకోవడం చాలా అవసరం. మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం, వ్యాయామం వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. సామాజికంగా ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు సామాజిక అనుసంధానాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవాలి. 

 డా. కృష్ణకుమార్ వేపకొమ్మ