05-10-2025 06:05:08 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సైకాలజిస్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డికి ఇంటర్నేషనల్ బెస్ట్ గురు అవార్డు 2025 లభించింది. ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ గురు, స్టూడెంట్స్ & పేరెంట్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కరీంనగర్‌లోని వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ టీచర్స్ డే 2025 వేడుకల సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ & పిజి కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని తన చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గురువు అనేది కేవలం బోధకుడు మాత్రమే కాదు, విద్యార్థుల మనసుల్లో వెలుగుని నింపే దీపం. విద్య ద్వారా మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, మానవతా విలువలను బలపరచడం నిజమైన గురువు ధర్మం. ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను కలిగించింది. భవిష్యత్తులో విద్యార్థుల మానసిక ఆరోగ్యాభివృద్ధి కోసం ఇంకా విస్తృత సేవ చేయాలనే తపనతో ఉన్నాను అని అన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు గంగారపు మల్లేశం, వైస్ ప్రెసిడెంట్ వి. కిరణ్, జనరల్ సెక్రటరీ పి. జయంత్ కుమార్, జాయింట్ సెక్రటరీ కె. అంజ బాబు, కోఆర్డినేటర్ డి. అంజన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంగారాపు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.