మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు
ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... మందు తాగి వాహనం నడపడం వల్ల తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీలలో నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
వీరిలో ఇద్దరికీ 5000 జరిమానాతో పాటు రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మరో ఇద్దరికీ 3000 జరిమానా ఒక రోజు జైలు శిక్ష విధించారు. ఈ కేసులను విచారించిన న్యాయమూర్తి ప్రవీణ్ మొత్తం నలుగురికి కలిపి 16,000 జరిమానా విధించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చేపట్టిన “అరైవ్-అలైవ్” కార్యక్రమం భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకు ప్రమాదకరమని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.






