10-10-2025 01:05:05 AM
విలువ
మేడ్చల్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో మాదకద్రవ్యాలు మళ్లీ గుప్పుమన్నాయి. జీడిమెట్ల పరిధి స్ప్రింగ్ ఫీల్ కాలనీలోని శ్రీ సాయిదత్త రెసిడెన్సీలోని ఓ ప్లాట్‌లో నిల్వ ఉంచిన రూ.10 కోట్ల విలువైన ఎఫిడ్రిన్‌ను గురువారం పట్టుకున్నారు. దేశీయంగా దీని విలువ రూ.10 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.72 కోట్లు ఉంటుంది. నలుగురిని ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది.
కాకినాడకు చెందిన శివరామకృష్ణ హైదరాబాద్‌కు వలస వచ్చి జీడిమెట్ల పరిధి సుచిత్ర క్రాస్‌రోడ్ సమీపాన ఉన్న స్ప్రింగ్ ఫీల్ కాలనీలోని శ్రీ సాయిదత్త రెసిడెన్సీ అపార్టుమెంట్‌లోని ఓ ప్లాట్‌లో నివాసముంటున్నాడు. ఐడీ ఏ బొల్లారంలోని పీఎన్‌ఎం లైఫ్‌సైన్స్ కంపెనీలో పనిచేస్తున్న అనిల్‌తో కలిసి ఎఫిడ్రిన్ తయారుచేసి విక్రయించాలని పథకం వేశారు. భారీ లాభాలు వస్తాయని శివరామకృష్ణ అనిల్‌కు చెప్పాడు.
అనిల్ సైతం లాభాల గురించి కంపెనీ డైరెక్టర్లకు వివరించాడు. దీంతో డైరెక్టర్లు కూడా కంపెనీలో డ్రగ్ తయారీకి అంగీకరించారు. శివరామకృష్ణ, అనిల్, కంపెనీ డైరెక్టర్లు మద్దు వెంకటకృష్ణారావు, ప్రసా ద్, లేబరేటరీ ప్రొడక్షన్ ఆపరేటర్ దొరబాబు ముఠాగా ఏర్పడ్డారు. శివరామ కృష్ణ డ్రగ్ తయారుచేయడానికి అనిల్‌కు ఫార్ములా ఇచ్చి అందుకు అవసరమైన ముడిసరుకు అందించాడు.
డ్రగ్‌ను పీఎన్‌ఎం లైఫ్ సైన్స్ కంపెనీలో తయారు చేశారు. 220 కిలోల ఎఫిడ్రిన్ అపార్ట్మెంట్‌లోని తన ప్లాట్‌లో శివరామకృష్ణ నిల్వ ఉంచాడు. దీనిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే ఈగల్ అధికారు లకు పక్కా సమాచారం అందడంతో గురువారం సోదాలు చేసి పట్టుకున్నారు.
గతంలో కూడా డ్రగ్‌ను విక్రయిస్తూ పట్టుబడినందున శివరామకృష్ణపై ఈగల్ అధి కారులు నిఘా ఉంచారు. శివరామకృష్ణతో పాటు అనిల్, దొరబాబు, వెంకట కృష్ణరా వులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఈగల్ అధికారులు వివరించారు.