11-10-2025 12:00:00 AM
నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
కల్వకుర్తి అక్టోబర్ 9: రాబోయే రోజులు పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా మారిపోతున్నాయని, ఈ నేపథ్యంలో సాంకేతిక విద్య చాలా కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం కల్వకుర్తి ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ ను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు శ్రద్ధగా, క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకోవాలని, నేర్చుకున్న నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
సాంకేతిక విద్య ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కూడా విస్తరించాయని, కేవలం ఉద్యోగాల కోసం కాకుండా కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ప్రయత్నించాలన్నారు, స్వయం ఉపాధి యజమానులుగా ఎదగాలనే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని తెలిపారు. అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేస్తున్నాయన్నారు.
శిక్షణ పొందుతున్న విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఏటీసీ సెంటర్లో ఎంత మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ జయమ్మ, కల్వకుర్తి తహసిల్దార్ ఇబ్రహీం, ఏటీసీ కోఆర్డినేటర్, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులుపాల్గొన్నారు.