calender_icon.png 23 July, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ వయా డార్క్ వెబ్

11-08-2024 06:22:53 AM

  1. పోలీసులకు చిక్కకుండా డ్రగ్ పెడ్లర్ల ప్లాన్ 
  2. క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు చెల్లింపులు 
  3. డ్రగ్స్‌కు బానిసైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిర్వాకంతో వెలుగులోకి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): మాదకద్రవ్యాలు.. ఎందరో యువతీ యువకుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. ఒక్కసారి మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారు అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు ఎన్నో రకాలుగా చర్యలు చేపడు తున్నప్పటికీ నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ను విక్రయిస్తున్న వైనాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు డార్క్ వెబ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో డార్క్ వెబ్ ద్వారా కస్టమర్లు మాదకద్రవ్యాలను ఆర్డర్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. నార్కోటిక్ టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జూలై 31న డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్‌ను ఆర్డర్ చేశాడు. ఇందుకోసం క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు చెల్లింపులు జరిపాడు.

అస్సాం నుంచి ఖమ్మంకు స్పీడ్ పోస్టులో డ్రగ్స్ డెలివరీ అయ్యింది. ఈ నెల 8న డ్రగ్స్ డెలివరీ చేస్తున్న క్రమంలో నిందితులను  ఖమ్మం పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులకు చిక్కకుండా  డ్రగ్స్‌ను న్యూస్ పేపర్‌లో చుట్టి ప్లాస్టర్ అంటించి పంపినట్లు పోలీసులు గుర్తించారు.  పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సమాచారం. 

న్యూజిలాండ్‌కు కొరియర్ ద్వారా..

మరోవైపు హైదరాబాద్‌లోనూ భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు కొరియర్ ద్వారా డ్రగ్స్‌ను  పంపుతున్న ఇద్దరు నిందితులను శనివారం డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుం చి రూ. 60 లక్షల విలువైన 3 కిలోల ఎఫెడ్రిన్/సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు ప్యాకెట్లలో  తెల్లటి పొడిని ఫీల్డ్ టెస్ట్ కిట్‌తో పరీక్షించగా అవి ఎఫెడ్రిన్/సూడోఎఫెడ్రిన్ డ్రగ్స్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకా రం కేసులు నమోదు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు.