11-08-2024 05:57:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం రోజురోజుకు మరింత వేగంగా విస్తరిస్తున్నది. రానున్న రోజుల్లో నగర జనాభా కోటిన్నరకు చేరుకోనుంది. రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా జనాభా నగరంలోనే నివసించే అవకాశాలు ఉన్నాయి. ఈ జనాభాకు మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం ఒక అంశం అయితే.. అంతే స్థాయిలో పర్యావరణ సమస్యలు తలెత్తకుండా చూసు కోవడం మరో ఎత్తు. అటవీ చట్టం నిబంధనల ప్రకారం 30 శాతం ఉండాల్సిన గ్రీనరీ హైదరాబాద్‌లో కేవలం 12.50 శాతం మాత్రమే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో జనాభాకు సరిపడా చెట్లు లేనందున నగరవాసులకు తగినంత ఆక్సిజన్ అందడం లేదు. విశ్వనగరంగా ప్రసిద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తుకు ఈ విషయంలో సంకట పరిస్థితులు ఎదురుకానున్నాయి.
గ్రేటర్ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 80 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ వాహనాల సంఖ్య వచ్చే 10 ఏళ్ల నాటికి 1.60 కోట్లకు చేరనున్నట్టు ప్రభుత్వ అంచనా. వీటి ద్వారా వ్యాపించే కాలుష్యం అంతా ఇంతా కాదు. దీనితో నగరం కాలుష్యపు కోరల్లో చిక్కుకొని వాతావరణంలో అసమతుల్యత చోటు చేసుకుంటుంది.
ఏయిర్ క్వాలిటీలో స్వచ్ఛత నిల్
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కోటి జనాభాకు తగ్గట్టుగా గ్రీనరీ అందుబాటులో లేకపోవడం విచారకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అధ్యయన సంస్థలు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకూ 7.71 కోట్ల మొక్కలను నాటినట్టుగా అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది తాజాగా వన మహోత్సవంలో భాగంగా 50 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకూ 13 లక్షల మొక్కలను నాటినట్టుగా అధికారులు చెబుతున్నారు.
ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం 30 శాతం ఉండాల్సిన (ఎక్కడైనా) గ్రీనరీ హైదరాబాద్ మహానగరంలో 12.50 శాతం మాత్రమే ఉన్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. మనిషికి నిమిషానికి 300 ఎంఎల్, రోజుకు 0.84 కేజీల ఆక్సిజన్, ఏడాదికి 9.5 టన్నుల ఆక్సీజన్ పీల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా 0 వరకూ ఉండాల్సిన ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 758కి చేరుకోవడంతో హైదరాబాద్ నగరవాసి ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నాడో స్పష్ట మవుతుంది.
హైదరాబాద్ మహానగరవాసులు స్వచ్ఛమైన గాలికి నోచుకోలేక శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం సైతం చైతన్యమై భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పర్యావరణ ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది.