calender_icon.png 23 July, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బికారీలతో బియ్యం దందా!

11-08-2024 06:30:49 AM

  1. గత పదేండ్లుగా ఇదే వ్యాపార రహస్యం 
  2. రికవరీపై చేతులెత్తేసిన పౌరసరఫరాల శాఖ 
  3. చట్టానికి చిక్కకుండా అనేక ఎత్తులు

బినామీలు.. గడిచిన పదేండ్లుగా రాష్ట్రంలో రైస్ మిల్లర్ల కొత్త ఎత్తుగడ ఇది. చట్టానికి చిక్కకుండా, చిక్కినా.. ఏమీ లేని బికారీలు, నిరుపేదలే ఉండటంతో.. రికవరీ చేయలేక అధికారయంత్రాంగమే చేతులెత్తేసేలా బడా రైస్ మిల్లర్ల కుట్రపూరితమైన ప్రయోగం ఇది. మామూలుగా ఏదైనా నేరం చేస్తే.. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. అదే రైస్ మిల్లర్లకు సంబంధించిన బియ్యం మిల్లింగు, వ్యాపారంలో ఏదైనా అవకతవకలు జరిగితే పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ విభాగాలు 6ఏ కేసు నమోదు చేసి.. సదరు నిందితుడిపై ఏమైనా స్థిరచరాస్తులు ఉంటే వాటిని రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుంటారు. ఏమీ ఆస్తిపాస్తులు లేని బీదలు, బికారీలు, కూలీపని చేసేవారు అయితే.. ఆ సమస్యే ఉండదు కదా! ఇదే ఆలోచించిన బడా రైస్ మిల్లర్లు గడిచిన పదేండ్లుగా బినామీలతో బియ్యం వ్యాపారం జోరుగా సాగించారు. 

ఎక్కల్‌దేవి శ్రీనివాస్

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): నిజామాబాద్‌కు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధికి రైస్ మిల్లులను చూసేందుకు ఒక బినామీ వ్యక్తిని నియమించుకుని బియ్యం వ్యాపారంలో తన హస్త‘వాసి’ని చూపించాలనుకున్నాడు. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల్లో తన బినామీకి దాదాపు 30 రైస్ మిల్లులను అప్పగించాడు. ఇందులో బినామీ పేరుపైనే కాకుండా.. వాచ్‌మన్లు, ట్రక్ డ్రైవర్లు, బినామీ చుట్టాల పేరిటకూడా పలు రైస్ మిల్లులను లీజుకు తీసుకున్నాడు. లక్షలాది క్వింటాళ్ళ ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లింగు చేయడానికి ఈ మిల్లులను కేటాయించుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని ఒక బడా రైస్ మిల్లరు ఆయన. రైస్ మిల్లర్ల అసోసియేషన్‌లో ఆయన ఎంత చెబితే అంత. ఆయనకూడా ఒక బినామీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బినామీకి నిర్మల్, నాందెడ్ దగ్గరలోని కుశ్నూర్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి తదితర ప్రాం తాల్లో సుమారు 40 మిల్లులను అప్పగించారు.

షరా మామూలుగానే.. ఇందు లో చాలా వరకు  మిల్లులను మునీం పేర్లపై, మిల్లుల్లో పనిచేసేవారి పేర్లపై లీజుకు తీసుకున్నాడు. ఈ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని లెక్కాపత్రం లేకుండా బయటి మార్కెట్లో అమ్మేసిన సదరు బడా మిల్లరు బ్యియ్యం వ్యాపారంలో తన బినామీ అండతో ‘ప్రభా’వం తంగా వెలిగిపోతున్నాడు.

Fరైస్ మిల్లుల అక్రమాలు, అవకతవకలపై అధికారయంత్రాంగం చర్యలు తీసుకోకుండా.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘విష్ణు’చక్రంలా  అడ్డుకునే శక్తిసామర్థ్యాలున్న మరో బడా మిల్లరు వ్యవహారం ఇది. బోధన్, సంగారెడ్డి, నారాయణఖేడ్, నాందెడ్ దగ్గరలోని కుశ్నూర్ ప్రాంతాల్లో దాదాపు 17 వరకు మిల్లులను తన దగ్గర పనిచేసే కూలీలు, వాచ్‌మన్లు, డ్రైవర్ల పేరిట లీజుకు తీసుకుని తన బినామీకి అప్పగించాడు. ఇంకేం వచ్చిన ప్రభుత్వ ధాన్యాన్ని వచ్చినట్టుగా బియ్యం చేసి బహిరంగ మార్కెట్లో, ఇతర ప్రాంతాలకు, దేశాలకుకూడా ఎగుమతి చేశారు. ఇలా లక్షలాది క్వింటాళ్ల ధాన్యం లెక్క తేలటం లేదు.

Fనిజామాబాద్ జిల్లాలోని మరో రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ఉండే ఒక మిల్లరు.. తన బినామీ వ్యక్తిని అడ్డుగా పెట్టుకుని చేస్తున్న బియ్యం వ్యాపారంలో వి‘నాయకుడి’లా ఎదిగాడు. వేలాది క్వింటాళ్ళ ధాన్యం లెక్కలు తేలడం లేదు. అధికారులు నామమాత్రంగా 6ఏ కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారు.

చట్టానికి చిక్కకుండా..

బడా రైసు మిల్లర్లు, మిల్లర్ల అవతారం ఎత్తిన ప్రజాప్రతినిధులు కొందరు.. తాము చట్టానికి చిక్కకుండా పక్కా ప్రణాళికతో ధాన్యం, బియ్యం వ్యాపారాల్లోకి దిగుతున్నారు. బినామీలను నియమించుకుని వారికి మిల్లులను అప్పగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా బినామీలతోనే చాలా మంది రైస్ మిల్లర్లు తమ వ్యాపారాన్ని మూడు క్వింటాళ్ల బియ్యం.. ఆరు క్వింటాళ్ళ ధాన్యం లాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఒకవేళ బినామీలు దొరకినా.. ఎక్కడా వారి పేరిట రికార్డులు లేకపోవడంతో చట్టంకూడా ఏమీచేయలేక చేతులెత్తేస్తోంది. పైగా అధికారుల అండదండలు షరా మామూలే.

ఆస్థిపాస్తులు లేనివారే..

ఇలా బినామీలుగా ఎంపిక చేసుకునేవారికి ఉండాల్సిన ప్రధాన అర్హత.. సదరు వ్యక్తుల పేరిట ఎలాంటి స్థిర, చర ఆస్తులు లేకపోవడమే. కారు, మోటారు సైకిల్ లాంటివి కూడా లేకుండా ఈ బడా రైస్ మిల్లర్లు జాగ్రత్త పడుతున్నారు. ఇలా తమ చెప్పు చేతుల్లో ఉండే బీదా బిక్కీ, ట్రక్ డ్రైవర్లు, వాచ్‌మెన్లు, తమ దగ్గర పనిచేసే కూలీలు, కార్మికులు, మునీంలను వీరు ఎంచుకుంటున్నారు.

భారీగా ధాన్యం.. బియ్యం మాయం

ఇలా లీజుకు తీసుకున్న రైస్ మిల్లుల్లో భారీగా ధాన్యాన్ని మిల్లింగు చేయిస్తున్నారు. దీనికోసం సదరు బడా మిల్లర్లు.. అధికారులతో ఉన్న సత్సంబంధాలను ఉపయో గించుకుంటూ.. భారీగా ఈ మిల్లులకు ధాన్యాన్ని కేటాయించుకునేలా చూస్తున్నారు. మిల్లింగు చేసిన బియ్యాన్ని ఎప్పటి కప్పుడు బహిరంగ మార్కెట్లో, లేదా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం ద్వారా అమ్మేసుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖ చేసే తనిఖీల్లో ఆయా మిల్లు ఉండాల్సిన ధాన్యం లేకపోవడంతో చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

రికవరీ ఎలా..

ప్రభుత్వం నుంచి వచ్చే ధాన్యాన్ని మిల్లింగు చేసి బియ్యాన్ని సివిల్ సప్లుకు అప్పగించాల్సిన బడా రైసు మిల్లర్లు బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. అయితే అధికారయంత్రాంగం తనిఖీల్లో ధాన్యం మాయ మైనా.. చట్టప్రకారం 6ఏ కేసులు మాత్రమే నమోదు చేస్తున్నారు. రెవెన్యూ రివకరీ యాక్టు ప్రకారం ముందుకు వెళదామంటే.. సదరు మిల్లుల యజమానుల (లీసు ఒప్పందం చేసుకున్న బినామీలు) పేరిట పట్టుమని పదివేల రూపాయల విలువైన ఆస్తులు కూడా ఉండటం లేదు.

నిరుపేదలు, కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వాచ్‌మెన్లను ఎంచుకునేటప్పుడే బడా వ్యాపారులు వారి పేరిట ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ధాన్యం మాయం కావడంతో లీజుదారు అయిన సదరు బినామీ నుంచి మాయమైన ధాన్యం మొత్తాన్ని రికవరీ చేద్దామంటే.. వాళ్ళపేర్లపై ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో అధికారులుకూడా చేతులెత్తేస్తున్నారు.

లీజుకు రైస్ మిల్లులు..

రాష్ట్రవ్యాప్తంగా అరకొరగా లాభాలు వస్తున్న రైసు మిల్లులు, ఇక వ్యాపారం మూసేద్దాం అని భావిస్తున్న రైసు మిల్లర్లు, చిన్న, మధ్య రకం రైసు మిల్లులను లక్ష్యంగా చేసుకుని.. ఒకింత ఆశ కలిగించే మొత్తాన్ని సదరు రైసు మిల్లర్లకు ఎర వేస్తున్నారు. ఈ తతంగమంతా సదరు బడా రైస్ మిల్లర్లే పూర్తిచేస్తారు. అంతా ఒప్పందం అయిపోయినంక.. కాగితాలు రాసుకునే క్రమంలో బినామీ పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు. వారిపేరిట లీజు ఒప్పందాలను రాయించుకుంటున్నారు. ఎవరి పేరు అయితే ఏమిటి.. తమకు రావాల్సిన లీజు మొత్తం వస్తుంది కదా.. అని చిన్న, మధ్య తరహా రైసు మిల్లర్లు భావిస్తున్నారు. కానీ ఇక్కడే బడా రైస్ మిల్లర్లు వ్యూహం అమలు చేస్తున్నారు.

లక్షల క్వింటాళ్ల ధాన్యం.. రూ. వేల కోట్ల వ్యాపారం..

ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో బడా మి ల్లర్లు, మిల్లర్ల అవతారం ఎత్తిన ప్రజాప్రతినిధులు గడిచిన పదేండ్లుగా ఈ బినామీ వ్యూహంతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతియేటా ప్రభుత్వం నుంచి ధాన్యం కేటాయించేలా చూసుకోవడం.. ఆనక బినా మీతో మిల్లింగు చేసి.. బహిరంగ మార్కెట్లో, ఇతర ప్రాంతాలు, దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రూ. వేల కోట్లను కొల్లగొట్టినట్టు రైస్ మిల్లర్లలోనే చర్చ సాగుతోంది.

గడిచిన పదేండ్లుగా ఖరీఫ్, రబీలో ఏయే మిల్లరుకు ఎంత ధాన్యం కేటాయించారు.. అందులో ఎంతమేర బి య్యం రూపంలో పౌరసరఫరాల శాఖకు చేరింది. ఇంకెంత పెండింగులో ఉంది. పెండింగులో ఉన్నం తమేర ధాన్యం మిల్లులో ఉందా. లేకపోతే.. ఏమయ్యింది అనేది సరిగా తనిఖీలు చేస్తేగానీ పూర్తిస్థాయిలో ఎంతమేర అక్రమాలు జరిగాయనేది తేలదు. కానీ రైసు మిల్లర్లలో ఉన్న చర్చ ప్రకారం చూస్తే.. లక్షలాది క్వింటాళ్ల ధాన్యం ఇలా అక్రమమార్గంలో తరలిపోయిందని, దాని విలువ రూ. వేల కోట్లలో ఉంటుందని స్పష్టమవుతోంది.