15-09-2025 06:52:57 PM
బోథ్,(విజయక్రాంతి): నాటు వైద్యం పేరిట అమాయక ప్రజలను మోసం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం బోథ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న సందర్భంలో ఇతరులు చెప్పిన మాటలు విని బోథ్ మండలం గొల్లాపూర్ లోని చందర్ సింగ్ స్వామి ని సంప్రదించారు.
నాటు వైద్యం చేసి బాధితురాలికి నయం చేస్తానని నమ్మబలికి, బాధితురాలికి మోకాలి నొప్పులు నయం చేయకపోగా నాటు వైద్యం పేరుతో, బాధితురాలిని ఇద్దరు మనుషుల సహాయంతో పట్టుకొని నడుము భాగంలో కాలితో తన్ని నడుమును గాయపరిచి, నడుము భాగంలోని డిస్క్ లకు గాయాలాయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బోథ్ పోలీస్ స్టేషన్ లో బాబా చందర్ సింగ్ స్వామి, పెందూర్ మనోహర్, సోయం సతీష్ కుమార్ లతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి, బాబా చందర్ సింగ్ స్వామి ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ ఘటన లో బాధితురాలి వద్ద నుండి రూ. 20,000 ఆన్లైన్ ద్వారా, ఒక లక్ష 50 వేల రూపాయలను పూజ పూజా సామాగ్రి పేరుతో వసూలు చేసి మోసం చేశారని తెలిపారు.