15-09-2025 06:56:30 PM
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని ఉత్కూర్ చౌరస్తాలో తెలంగాణ రైతన్న సాయుధ పోరాట వారోత్సవాలను సిపిఐ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి మేదరి దేవవరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు మాట్లాడుతూ... సెప్టెంబర్ 11 నుండి 17 వరకు గ్రామస్థాయి నుండి పట్టణ, మండల కేంద్రాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తూ సాయుధ పోరాట చరిత్రను అమరవీరుల త్యాగాలను సెమినార్లు సదస్సులు సమావేశాలు నిర్వహించి నేటి సమాజానికి తెలిసే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 ముగింపు సభ హైదరాబాద్, రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ముగింపు సభకు పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు జిల్లా వ్యాప్తంగా పాల్గొనాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నవాబులకు వ్యతిరేకంగా జమీందారు, జాగీర్ధాలు, దేశముఖ్ భూస్వాములకు వ్యతిరేకంగా జరగాయన్నారు. ఈ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య మరణించడం, భువనగిరిలో ఆంధ్ర మహాసభ ద్వారా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్ లు గేరిల్లా దళాలను ఏర్పాటు చేసి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాలను పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ది అని కొనియాడారు.
ఈ సాయుధ పోరాటంలో సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలను వదిలారు. పోరాట ఉద్యమస్ఫూర్తిగానే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో సెప్టెంబర్ 17న విలీనం చేసి నిజాం నవాబులను వెళ్లగొట్టిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి దక్కిందని అన్నారు. కానీ ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హిందూ, ముస్లిం మద్య జరిగినటువంటి పోరాటమని వక్రీకరిస్తూ చెప్పడం జరుగుతుందన్నారు. స్వాతంత్రం కొరకు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం కొరకు ఏనాడు బిజెపీ, ఆర్ఎస్ఎస్ గాని పోరాటంలో పాల్గొనలేదన్నారు. ఆనాడు హైదరాబాద్ సంస్థానంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఉండేది ఈనాడు ఆ రాష్ట్రాలు తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవాన్ని ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సాయుధ పోరాట చరిత్రను అమరవీరుల త్యాగాలను పాఠ్యపుస్తకాలలో చేర్పించి నేటి సమాజానికి తెలిసే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మేదరి దేవవరం, ఏఐటియుసి మండల కార్యదర్శి కేతిరెడ్డి రమణారెడ్డి,రవికిరణ్, దుర్గం దేవ దాస్,తిప్పని సత్తయ్య, బైరీ రాజన్న,ఐలయ్య,లచ్చన్న, శివ, తదితరులు పాల్గొన్నారు.