22-01-2026 12:00:00 AM
సొంత జిల్లాలు, ఒకేచోట ఏళ్ల తరబడి ఉన్నవారిపై బదిలీ వేటు
పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యం
ఈసీ మార్గదర్శకాల మేరకే చర్యలు
తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశం..
జీవో 87 జారీ చేసిన పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 21 (విజయక్రాంతి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మో గేందుకు సమయం ఆసన్నమైన వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పాటించేందుకు, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గ దర్శకాలకు అనుగుణంగా పురపాలక శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది.
పరిపాలనా సౌలభ్యం, ఎన్నికల నిబంధనల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఈ మేరకు జీవో ఆర్‌టీ నంబర్ 87ను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేస్తూ సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ కె నారాయణ రావు ఎండార్స్‌మెంట్ జారీ చేశారు.
రాష్ట్రంలోని వివిధ మున్సిపాలి టీల్లో సుదీర్ఘకాలంగా మూడేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారులను, అలాగే తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల సమయంలో అధికారులు పక్షపాతం గా వ్యవహరించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బదిలీ అయిన వారిలో గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3, స్పెషల్ గ్రేడ్, సెలెక్షన్ గ్రేడ్ కమిషనర్లతో పాటు డిప్యూటేష న్ పై పనిచేస్తున్న మేనేజర్లు, ఇతర అధికా రులు ఉన్నారు. కార్పొరేషన్లు..
ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును రామగుండం కార్పొరేషన్ సెక్రటరీగా, నల్గొండ కమిషనర్ ముసాబ్ అహ్మద్‌ను హుజురాబాద్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. పదోన్నతిపై బి శరత్ చంద్రను నల్గొండ కార్పొరేషన్ కమిషనర్‌గా, టి ప్రవీణ్ కుమార్ రెడ్డిని మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఎన్. యాదగిరి రావు, సెక్రటరీగా శ్రీపాద రామేశ్వర్లను నియమించారు. మంచిర్యాల కార్పొరేషన్‌కు కె. సంపత్ కుమార్‌ను బదిలీ చేశారు.జీహెచ్‌ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న టీఎస్‌వీఎన్ త్రిల్లేశ్వర్ రావుతో పాటు ఆర్ వెంకట్ గోపాల్, ఎస్ అజయ్ కుమార్ రెడ్డి, పి. రామాంజుల రెడ్డి వంటి అధికారులను బదిలీ చేశారు.
మున్సిపాలిటీలు.. క్యాతనపల్లి కమిషనర్ జి రాజును ఆదిలాబాద్‌కు, ఆలేరు కమిషనర్ బి శ్రీనివాస్‌ను హుజూర్ నగర్‌కు, పదోన్నతిపై డి జైత్రమ్ను జహీరాబాద్‌కు బదిలీ చేశారు. వీరితో పాటు చొప్పదండి, రాయ కల్, భూత్పూర్, అమరచింత, బెల్లంపల్లి, ములుగు, కల్లూరు, తిరుమలగిరి, కొల్లాపూర్, అచ్చంపేట, నందికొండ, వేములవాడ, వికారాబాద్, మొయినాబాద్, దేవరకొండ, భైంసా, ఇబ్రహీంపట్నం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, ఆర్మూర్, కోరుట్ల, కాగజ్ నగర్, నేరేడుచర్ల, తాండూరు కమిషనర్లకు స్థానచలనం కలిగింది.
బదిలీ అయిన అధికారులంతా తక్షణమే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉన్నందున, విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరిం చింది.త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 24న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.