calender_icon.png 28 November, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో ఈగల్ పంజా!

28-11-2025 12:31:55 AM

  1. దేశ రాజధానిలో భారీ డ్రగ్స్ ఆపరేషన్
  2.   50 మంది నైజీరియన్ల అరెస్ట్
  3. నెలల తరబడి టీఎస్ పోలీసుల మకాం
  4.   20 చోట్ల దాడులు
  5. భారీగా సింథటిక్ డ్రగ్స్ సీజ్.. వెలుగులోకి హవాలా రాకెట్

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 27 (విజయక్రాంతి) : మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు తెలంగాణ పోలీసులు సరిహద్దులు దాటి వేట మొదలుపెట్టారు. సినిమా ఫక్కీలో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణకు చెందిన ఈగల్ ఫోర్స్ సంచలన ఆపరేషన్ నిర్వహించింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి చేపట్టిన ఈ భారీ జాయింట్ ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్, హవాలా రాకెట్ గుట్టు రట్టయింది.

నెలల తరబడి సాగిన నిఘా, పక్కా ప్లాన్‌తో దాదాపు 50 మంది నైజీరియన్లను అరెస్ట్ చేసి డ్రగ్ మాఫియా వెన్నులో వణుకు పుట్టించారు. ఈ ఆపరేషన్ కోసం తెలంగాణ పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. ఈగల్ ఫోర్స్‌కు చెందిన 100 మందికి పైగా ప్రత్యేక సిబ్బందిని రెండు రైలు బోగీల్లో ఢిల్లీకి తరలించారు. వీరంతా వారంరోజుల పాటు అక్కడే మకాం వేసి, క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించారు.

అనంతరం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, నోయిడా, గ్వాలియర్ పోలీసుల సహకారంతో ఢిల్లీలోని 20 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కిలోల కొద్ది.. అత్యంత విలువైన మెతాంఫెటమై న్, కొకైన్ వంటి సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ నెట్‌వర్క్ ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్, బెంగళూరు, గోవా, కేరళ వరకు విస్తరించినట్లు విచార ణలో తేలింది.

వీరు పోలీసులకు చిక్కకుండా డెడ్‌డ్రాప్ పద్ధతిలో, ఫుడ్‌డెలివరీ యాప్‌ల ద్వా రా కమ్యూనికేషన్ నడిపినట్లు గుర్తించారు. విస్తుపోయే విషయం ఏంటంటే.. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను విస్తరించేందుకు వీరు సెక్స్ వర్కర్లను, సేల్స్ గర్ల్స్‌ను ఉపయోగించుకున్నారు. దాదాపు 2,000 మంది వీరివద్ద రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్లు సమాచారం. కేవలం డ్రగ్స్ అమ్మడమే కాకుండా, ఆ డబ్బును నైజీరియాకు తరలించేందుకు ఈ ముఠా వినూత్న హవాలా పద్ధతిని ఎంచుకుంది.

ఇండియన్ కరెన్సీని వస్తువులు, గార్మెంట్స్ రూపంలోకి మార్చి లాగోస్ నైజీరియాకు పంపి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు. ఈ సిండికేట్ ప్రధాన సూత్రధారి ఒక్కడే రూ.15 కోట్లమేర హవాలా లావాదేవీలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మంది నైజీరియన్లను ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

ఇక్కడికి వచ్చాక వారిని కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. మరోవైపు ఈ ముఠాతో సంబంధాలున్న మరో ఇద్దరు నైజీరియన్ మహిళలను ఈగల్ టీమ్ ఏపీలోని విశా ఖపట్నంలో అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ ముఠా అరెస్ట్ తెలంగాణ పోలీసుల పనితీరుకు నిదర్శనంగా నిలిచింది.