calender_icon.png 28 November, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ కన్నెర్ర చేస్తే..!

28-11-2025 12:49:16 AM

క్యాబినెట్ భేటీ లీకులకు లాక్ పడేనా?

ఎన్టీఆర్ దూకుడు సాధ్యమవుతుందా?

* మార్చి 1989లో సున్నితమైన బడ్జెట్ ప్రతిపాదనలు, ముఖ్యంగా రెండు రూపాయల బియ్యం పథకానికి నిధుల లోటు వివరాలు లీక్ కావడంతో ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. లీక్‌ను తన పార్టీలోని అసంతృప్త వర్గాలు చేసిన ‘నమ్మక ద్రోహం’గా భావించిన ఆయన, మంత్రులందరితో రాజీనామా చేయించారు. 

* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఎన్టీఆర్ తరహాలోనే క్యాబినెట్‌లో చర్చించిన  ‘హిల్ట్’ పాలసీ వివరాలను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా అని చర్చ జరుగుతున్నది. ‘పెద్ద పదవిలో ఉన్నా చర్యలు తప్పవు’ అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించినప్పటికీ, 1989 తరహా నిర్ణయాలు ఇప్పుడు సాధ్యపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ రకమైన చర్యలకు అనుమతించదు. 

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి) : ఏ రాష్ట్రంలోనైనా ప్రగతి, అభివృద్ధి, పాలసీ పరమైన నిర్ణయాలన్నీ మంత్రివర్గ సమావేశంలోనే జరుగుతాయి. ఈ క్రమంలో క్యాబినెట్ మీటింగ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పరిపాలనకు సంబంధించిన విషయాలపై చర్చించే నేపథ్యంలో నిర్ణయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు. దీనికి కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినహా ఇతరులెవరినీ సమావేశానికి అనుమతించరు.

అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలోని ఇటీవలి క్యాబినెట్ సమావేశం చర్చనీయాంశంగా మారుతున్నది. క్యాబినెట్‌లో జరిగిన చర్చలు బయటకు లీక్ కావడం రాష్ర్ట రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలకు దారితీసింది. పారిశ్రామిక భూముల బదలాయింపునకు సంబంధించి ‘హిల్ట్’ పాలసీ వివరాలు బయటికి పొక్కడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. నవంబర్ 25న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయంలో మాట్లాడుతూ.. ‘క్యాబినెట్ వ్యవహారాలు అత్యంత సున్నితమైనవి.

అనుమతి లేకుండా లీక్ చేయడం తీవ్ర నేరం. ఎలాంటి హోదాలో ఉన్నా కఠిన చర్య తప్పదు’ అని హెచ్చరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాల లీకుల అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలతో 1989లో ఎన్టీ రామారావు తీసుకున్న సంచలన చర్య రాజకీయవర్గాల్లో మళ్లీ చర్చనీయాంశమైంది. ఆ సమయంలో బడ్జెట్ లీక్ కారణంగా ఎన్టీఆర్ మొత్తం మంత్రివర్గాన్ని ఒకేసారి తొలగించిన ఘటన ఇప్పటికీ ఒక అరుదైన రాజకీయ పరిణామం. 

టీడీపీ ఓటమికి దారితీసిన పరిణామం..

మార్చి 1989లో, ఎన్నికలకు ముందు సున్నితమైన బడ్జెట్ ప్రతిపాదనలు, ముఖ్యంగా రెండు రూపాయల బియ్యం పథకంలో నిధుల లోటు వివరాలు లీక్ అవ్వడంతో ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహానికి గుర య్యారు. లీక్‌ను తన పార్టీలోని అసంతృప్త వర్గా లు చేసిన ‘నమ్మక ద్రోహం’గా భావించిన ఆయన, మార్చి 8న మంత్రులందరితో రాజీనామా చేయించారు. తన మంత్రి వర్గ సహచరులందరూ నమ్మక ద్రోహం చేశారని బహిరంగంగానే ఆరోపించారు.

వారం రోజుల తర్వాత అస్సాం ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వచ్చి, నమ్మకస్తులతో కూడిన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం భారీ ప్రతికూల ఫలితాలు ఇచ్చింది. కే. జనారెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వసంత నాగేశ్వర రావు, కే.ఈ. కృష్ణమూర్తి, ముద్రగడ పద్మనాభం వంటి హేమాహేమీలైన నాయకులను అవమానపర్చడంతో వారు తిరుగుబాటుదారులుగా మారారు.

మంత్రులతో రాజీనామా చేయించడం, కాంగ్రెస్ విస్తృత ప్రచారం కారణంగా 1989 నవంబర్ ఎన్నికల్లో టీడీపీ విజయ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. టీడీపీ కేవలం 74 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 181 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టింది. ఈ పరిణామంతో ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ముగిసి పోయింది. 

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి..

ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 23 నెలల పాలనలో మంచి ప్రజాభిమానంతో ముందుకు సాగుతున్నప్పటికీ, పంట రుణమాఫీ అమలు ఆలస్యం, ఇన్‌పుట్ సబ్సిడీలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూ విధానా లపై అసంతృప్తి కారణంగా ప్రభుత్వంలో కొన్ని చీలికలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీ లీక్.. పెద్ద రాజకీయ దుమారంగా మారింది.

పరిశ్రమ-మౌలిక వసతుల అభివృద్ధి కోసం భూములను వినియోగించేందుకు రూపొందించిన ఈ పాలసీలో భాగంగా భూసేకరణ చట్టం-2013 కంటే మెరుగైన పరిహారం అందిస్తామని ప్రభుత్వ హామీ ఇస్తున్నప్పటికీ ఇలాంటి సున్నితమైన సమాచారం ముందుగానే లీక్ కావడంతో.. రైతు సంఘాలు, రియల్ ఎస్టేట్ వర్గాలు, ప్రతిపక్షాలు ఒకేతాటి పైకి రావడంతో విమర్శలు పుట్టుకొచ్చాయి.

ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎన్టీఆర్ తరహాలోనే క్యాబినెట్ అంశాన్ని లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా అని చర్చ జరుగుతున్నది. ‘పెద్ద పదవిలో ఉన్నా చర్యలు తప్పవు’ అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించినప్పటికీ, 1989 తరహా నిర్ణయాలు ఇప్పుడు సాధ్యపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ ఈ రకమైన చర్యలకు అనుమతించదు. 

ఎన్టీఆర్ తరహా చర్యలు అసాధ్యం..

సీఎం రేవంత్‌రెడ్డి, ఎన్టీఆర్‌ల వ్యవహార శైలి వేర్వేరుగా ఉంటాయి. రేవంత్‌రెడ్డి నిర్వహణాత్మక, బ్యాలెన్సింగ్ రాజకీయాలు చేసే నాయకుడు. డ్రామాటిక్ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఈ క్రమంలోనే క్యాబినెట్ నిర్ణయాల లీకులపై గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంత్రుల రాజీనామా కంటే లీకుల కారణమైన వారి సహాయకులపై రహస్య చర్చల తీసుకోవడంతోపాటు అధికారికంగా హిల్ట్ పాలసీ వివరాలను నియంత్రణతో విడుదల చేయడంపై దృష్టి సారించే అవకాశం ఉంది.

అయితే మొత్తంగా 1989 నాటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నప్పటికీ ఈసారి భావోద్వేగ దూకుడు కాకుండా, ఆచరణాత్మక రాజకీయాలు ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ లీక్ కేసును మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత సీరియస్‌గా తీసుకుని, నష్ట నివారణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.