28-11-2025 12:22:52 AM
‘సిగాచీ’ పేలుడు దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం
ఐదు నెలలైనా బాధ్యులను గుర్తించకపోవడమేమిటని మండిపాటు
హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి): పాశమైలారంలోని సిగాచీ పరిశ్ర మలో జరిగిన పేలుడు ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ఎందుకు జరపడం లేదం టూ హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన సాధారణ విషయం కాదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు, 54 మంది కార్మికులు మృతిచెందారు.
జూన్ 30న పేలుడు సంభవిస్తే ఇప్పటివరకు పూర్తిస్తాయిలో దర్యాప్తు జరపకపోవడమేంటి? దర్యాప్తు ఎందుకు నత్తనడకన సాగుతోంది? ఇప్పటివరకు పేలుడు ఘటనకు బాధ్యులెవరో తేల్చకపోవడమేంటి? 237 మంది సాక్షులను విచా రించి కూడా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడమేంటి? 54 మంది చనిపోతే విచారణ అధికారిగా కేవలం ఒక డీఎస్పీని నియమిస్తారా? దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా? దర్యాప్తునకు ఇంకెంత సమయమిస్తే పూర్తి చేస్తారు’ అని హైకోర్టు మండిపడింది.
సిగాచీ పేలుడు ఘటనపై బాబురావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధ వాదనలు వినిపిస్తూ.. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 5 నెలలు దాటిందని, పోలీసులు ఇప్పటివరకు ఒక్కరినైనా అదుపులోకి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు.
పరిశ్రమలో నిర్వహణపరమైన లోపాలున్నాయని నిపుణల కమిటీ కూడా తేల్చిందని తెలిపారు. పరిశ్రమలో నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పేలుడు తీవ్రతకు ఎనిమిది మంది శరీరాల అవశేషాలైనా లభించలేదన్నారు.
ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ రజినీకాంత్ తన వాదనలు వినిపిస్తూ.. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కోర్టుకు సమాధానమిచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. పోలీసులు వెంటనే తమ దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి డీఎస్పీ కోర్టు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.