28-11-2025 01:22:46 AM
ఎన్నికల సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్‌రెడ్డి
భద్రాచలం, నవంబర్ 27, (విజయక్రాంతి):గ్రామపంచాయతీ ఎన్నికలు2025 ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి గురువారం బూర్గంపహడ్, భద్రాచలం మండల పరిధిలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మొరంపల్లి బంజర్, లక్ష్మీపురం, పినపాక పట్టి నగర్, బూర్గంపాడు, భద్రాచలం గ్రామపంచాయతీల నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, హెల్ప్డెస్క్ల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, భద్రతా ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఎన్నికల సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నామినేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగాలని అధికారులను, సిబ్బందిని సూచించారు. అభ్యర్థులకు అవసరమైన సమాచారం సకాలంలో అందేలా హెల్ప్డెస్క్లను సమర్థవంతంగా నిర్వహించాలని, అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అభ్యర్థులకు సహాయం అందించాలన్నారు.
అలాగే, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కట్టుదిట్టమైన సూచనలు చేశారు.నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు, భద్రాచలం ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.