28-11-2025 12:42:13 AM
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి) : బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్‌లో సవరణ జరగాలని, ఈ అంశంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గురువారం ప్రజాభవన్‌లో అన్ని రాజకీయ పక్షాల ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశిత ఫార్మాట్‌లో వాయిదా తీర్మానం లేదా క్వశ్చన్ అవర్‌లో చర్చకు తీసుకురావాలని, ప్రధానమంత్రిని కలిసి అన్ని పార్టీల ఎంపీలు ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని సూచించారు. ప్రధానమంత్రి సమయం ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా మని వివరించాలని విజ్ఞప్తి చేశారు. బీసీల రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ర్టంలో ఎపిక్ సర్వే జరిగిందని, ఎంపిరికల్ డాటా ఆధారంగా అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టగా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించగా, బిల్లు గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్లి అక్కడ పెండింగ్‌లో ఉందని తెలిపారు.
రాష్ర్ట ప్రయోజనాలకు అనుకూలంగా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను విజ్ఞప్తులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన సమాచారం నిమిషాల్లో లేదా గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని, దీనిని ఎంపీలు వినియోగించుకోవాలని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వ శాఖలు ఏ విధంగా పూర్తి సంసిద్ధంగా ఉంటాయో, పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రభుత్వ యం త్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండి సమాచారం అందించేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు రాష్ర్ట ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో ప్రశ్నించడం, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలనుకుంటే.. విషయా న్ని వివరిస్తే చాలు నిర్దేశిత ఫార్మాట్లో సమాచారాన్ని, విజ్ఞాపన పత్రాలను ఢిల్లీలోని రాష్ర్ట అధికారులు ఎంపీలకు అందిస్తారని స్పష్టం చేశారు.
నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, జీఎస్టీ తదితర విషయాలకు సంబంధించి కేంద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాలకు సంబంధించి గతంలో లేఖలు రాశామని, ఆ లేఖలు ఢిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపీలకు అందుబాటులో ఉంటాయని, వాటి ఆధారంగా ఎంపీలు ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ 9 నాటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాల వివరించడంతోపాటు తెలంగాణ రాష్ర్ట భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నామని వివరించారు.
దేశంలో, ప్రపం చంలో ప్రముఖులను దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని, 2047 కల్లా మూడు ట్రిలి యన్ డాలర్ల ఎకానమీ లక్ష్యసాధనకు అవసరమైన వనరులు, ప్రణాళిక తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న ఎంపీలు పేర్లు ఇస్తే కమిటీలు సభ్యులుగా నమోదు చేస్తామని, దేశంలో, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో ఎంపీలెవరికైనా పరిచయం ఉంటే వివరాలు ఇస్తే రాష్ర్ట ప్రయోజనాల కోసం వారిని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
ప్రధానిని సమష్టిగా కలుద్దాం..
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్, ఇతర సమస్యలపై ప్రధానమంత్రి సమయం తీసుకుని సమిష్టిగా కలుద్దామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమావేశంలో చెప్పారు. అంతేకాక ఆదిలాబాద్ -పటాన్ చెరు రైల్వే లైన్‌పై సాధ్యాసాధ్యాలు, డీపీఆర్ ఏమైనా చేశారా అని అడిగారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అలాట్‌మెంట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తే.. సంబంధిత మంత్రిని పార్టీలకు అతీతంగా కలసి లేఖ ఇద్దామని ప్రతిపాదించారు.
రాష్ట్రానిక అవసరం అయిన బొగ్గు గనుల విషయంలో అందరం కలిసి కోల్ మినిస్టర్ కలుద్దామని ప్రతిపాదించారు. ఇది ఆహ్వానించదగ్గదని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి చెప్పారు. మహబూబ్‌నగర్ విమానాశ్రయంపై పూర్తి సమాచారంకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలన్నారు. గద్వాల- రైల్యే లైన్ సర్వేపైనా సమాచారాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే బ్యాక్ వాటర్ వల్ల తమ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ చెప్పారు.
ఈ సమస్యపైనా పరిష్కారం కావాలని చెప్పారు. ములు గు-ఏటూరునాగారం రహదారిని కేంద్రం మంజూరు చేసినా ఇప్పటికి టెండర్ ఖరారు కాలేదని చెప్పారు. దీనిపై పార్లమెంట్‌లో ప్రస్తావన చేయాలన్నారు. రాష్ర్టంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యక్రమంలో పనిదినాలు బాగా తగ్గుతున్నాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ చెప్పారు. జహీరాబాద్ రహదారి అత్యంత కీలకమైంది. దీనిపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు.. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావన తీసుకురా వాలని అన్నారు.
అదిలాబాద్ విమానాశ్ర యం కోసం 800 ఎకరాలు అవసరం అవుతాయని రాష్ర్ట ప్రభుత్వం కలెక్టర్‌కు లేఖ రాసిందని, ఇప్పటికే అక్కడ 369 ఎకరాలు ఉన్నాయని అదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ చెప్పారు. దీనికి అధికారలు స్పందిస్తూ.. మొత్తం గా వెయ్యి ఎకరాలు అవసరం అవుతాయని లేఖ రాశారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 700 ఎకరాల భూ సేకరణ చేయాలని చెప్పారు. వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? అని ఎంపీ కడియం కావ్య అడిగారు. దీనిపైనా ప్రశ్నించాలని చెప్పారు.