calender_icon.png 26 January, 2026 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా ప్రదాత

03-01-2025 12:00:00 AM

మహిళలకు చదువు నేర్పి వారి చైతన్యానికి పునాదులు వేయడంలో సావిత్రీబాయి ఫూలే కృషి అమోఘం. మహిళలు సమాజానికి వెలుగు దివ్వెలు.. వారికి గౌరవం లభించినప్పుడే సమాజంలో మరింత మేలు జరుగుతుందని నమ్మిన సంఘ సంస్కర్త. నేడు సావిత్రీ బాయి పూలే జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను చదును చేయాలని.. 18వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు ప్రయత్నించారు. మొక్కవోని వారి దీక్ష వల్ల అప్పటి సమాజంలో హీన స్థితిలో ఉన్న స్త్రీల జీవితాలను అండ దొరికింది. భర్త జ్యోతిబా ఫూలే ప్రోత్సాహంతో స్వయంగా చదువుకున్న సావిత్రీబాయి దేశంలో మహిళా విద్యకు దారిదీపం అయింది.

1840లో తొమ్మిది ఏళ్ల సావిత్రీబాయి వివాహం 13 ఏళ్ల జ్యోతిబా ఫూలేతో జరిగింది. స్త్రీలకు విద్య చాలా అవసరం అని గ్రహించి ముందు తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పాడు జ్యోతిబా. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్ట మొదట ప్రవేశపెట్టిన వాడు జ్యోతిబాఫూలే. తన పొలం దగ్గర మామిడి చెట్టు నీడలో పాఠశాల పెట్టాడు. ఆ పాఠశాలలో ఆయన అక్క సుగుణబాయి, భార్య సావిత్రీబాయి విద్యార్థులు. స్త్రీ విద్యా ప్రయోగశాలగా ఆ పాఠశాల చరిత్రలో మిగిలిపోయింది. 

1848లో ఓ భవంతిలో స్త్రీల కోసం పాఠశాలను ఏర్పాటు చేశాడు ఫూలే. చదువు నేర్చుకునే క్రమంలో సావిత్రీబాయి ఎన్నో పుస్తకాలు చదివి స్త్రీ ఎంత దారుణ స్థితిలో ఉందో అర్థం చేసుకుంది. అదే సమయంలో అమెరికా నల్లజాతి వివక్ష వ్యతిరేక పోరాట నాయకులు థామస్ క్లార్క్ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొందింది. బ్రాహ్మణ స్త్రీలతోపాటూ బహు జన స్త్రీ జనోద్దరణకు భర్తతో పాటూ నడుం బిగించింది.

స్త్రీలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను ఆమే ఇన్‌చార్జ్‌గా వ్యవహరించింది. ఫూణేలో అమ్మాయిల కోసం మరో స్కూలు ప్రారంభించారు. మెల్లమెల్లగా ఫూలే దంపతులు 18 పాఠశాలలను స్థాపించారు. అయితే నాటి ఛాందసవాదులు సావిత్రీబాయి మామగారిని.. ఆయన కొడుకూ, కోడలూ శ్రాస్త విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రెచ్చగొట్టారు. దీంతో ఫూలే దంపతులను మామగారు ఇంటి నుంచి వెళ్లగొట్టారు.

అయినా ఆ దంపతులు తమ మార్గాన్ని మార్చుకోలేదు. ఆత్మహత్య చేసుకోబోతున్న కాశీ బాయి అనే గర్భవతి అయిన బ్రాహ్మణ వితంతు మహిళను కాపాడి ఆమె కన్న పిల్లవాడిని దత్తత తీసుకుని ‘యశ్వంతరావు’ అని పేరు పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. మహారాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చి జనాలు ఆకలితో అలమటిస్తుంటే తమ ‘సత్య శోధక సమాజ్’ ద్వారా ఆహార సేకరణ చేసి ఆదుకున్నారు. ఆమె మంచి ఉపాధ్యాయురాలే కాదు.

కవయిత్రి కూడా. ఆమె రచించినటువంటి ‘కావ్య పుష్పాలు’ అనే సంపుటి చాలా గొప్పది. ప్లేగు వ్యాధిగ్రస్థులకు సేవ చేస్తూ ఆ వ్యాధికే బలై 1897 మార్చి 10వ తేదీన తుది శ్వాసవిడిచి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహనీయురాలు సావిత్రీబాయి.