03-01-2025 12:00:00 AM
పవిత్ర స్నానాలు ప్రత్యేక దినాలు
ప్రపంచంలోనే అతిపెద్ద భక్తి ఉత్సవమైన మహా కుంభమేళాకు రంగం సిద్ధమైంది. ఈనెల 14 (మకర సంక్రాంతి)న ప్రారంభమై, ఫిబ్రవరి 26 మహా శివరాత్రిన ముగుస్తుంది. మొదటిరోజు ‘రాజస్నానం’ అత్యంత విశిష్టమైందిగా ప్రసిద్ధి. మిగిలిన పుణ్య తిథుల్లోనూ ఇక్కడి నదీ స్నానాలు విశేష ఫలాలను ఇస్తాయని అంటారు. మహా శివరాత్రినాటి చివరిరోజును శివుని ఆరాధనకు అంకితమైందిగా భావిస్తారు.
ఆనాడు భక్తులు ఉపవాసం, ధ్యాననిష్ఠలలో మునిగిపోతారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులు, సాధువులు, అన్వేషకులను ఆకర్షించే ఉత్సవంగా కుంభమేళాకు గొప్ప పేరుంది. అనేకులు ఈనాటి భక్తి, ఆధ్యాత్మికతతో కనెక్ట్ అవ్వడానికి, ఆత్మలను శుద్ధి చేసుకోవడానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుగ్రహం 12 సంవత్సరాలలో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది.
ఈ గ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నవేళ కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీ. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలోకి వచ్చి చేరుతుందని వేద పండితులు అంటారు. పన్నెండేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు (ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్)లలో జరుపుకొనే మహా వేడుక ఇది.
ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి సరైన సమయం
ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర నదులు గంగ, యమునా, సరస్వతిల సంగమాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ త్రివేణీ సంగమ స్నానం కోసం లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. కుంభమేళ వేళ నదుల జలాలు దైవిక శక్తిని పొందుతాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి ఆధ్యాత్మిక జ్ఞానోదయమవుతుందనీ భావిస్తారు.
చరిత్రలో చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభమైన కుంభమేళ కాలక్రమేణా మహోత్సవం స్థాయికి చేరింది. దీనికి సుమారు 2 వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్టు చెప్తారు. హర్షవర్ధన రాజు పాలనలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు జువాన్‌జంగ్ ఖాతాలలో మేళాకు మొదటి రాత సాక్ష్యంగా ఉన్నట్టు చెప్తారు. ప్రాచీన భారతదేశంలో ఇది మత సమావేశాలకు మాత్రమేకాక వేదజ్ఞాన అభ్యాసాలకు, చర్చలకు కూడా వేదికైనట్టు తెలుస్తున్నది.
ఋషులు, పండితులు తమ జ్ఞానాన్ని ఇక్కడ పలువురు పెద్దలతో పంచుకునేవారు. యాత్రికులు వీరి ఆశీర్వాదం పొందడానికి పూజలు చేసేవారట. కొన్ని చారిత్రక ఆధారాలు కుంభమేళా సమావేశాలు క్రీ.పూ. 300 ఏళ్ల నాటివని కూడా చెబుతున్నాయి. మధ్యయుగ కాలంలో వివిధ పాలకుల మద్దతుతో కుంభమేళా అభివద్ధి చెందింది. మౌర్యులు, గుప్తులు వంటి రాజులు, ఇతర రాజవంశాలు ఈ వేడుకను పెద్ద ఎత్తున ప్రోత్సాహించాయి.
‘కుంభం’ అంటే ‘అమృతం’. మేళా వెనుక ఉన్న కథ క్షీరసాగర మథనం. అమృత ధారలు (చుక్కలు) ఆయా నదీజలాల్లో కలిసిన పవిత్ర సందర్భం. కుంభమేళాకు మూ లం పురాణాలలోనూ కనిపిస్తుంది. ఈ ఉత్సవాన్ని ఆధ్యాత్మిక మేల్కొలుపుగానూ అనేకు లు భావిస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం గురువు, సూర్యుడు, చంద్రుడు మేషచక్రంలో మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ‘మహా కుంభమేళా’ నిర్వహిస్తారు.
ఈ అరుదైన కలయిక ‘త్రివేణి సంగమం’ (గంగా, యమునా, సరస్వతి నదుల కూడలి) వద్ద నదుల జలాలను పవిత్రంగా మారుస్తాయని విశ్వాసం. కుంభమేళా కథనం ప్రకారం దేవతలు, రాక్షసులు అమరత్వ సాధనకు సముద్ర మథనం చేయగా, అందులోంచి అమృతం ఉద్భవించింది. ఈ విశ్వ సంఘటన సమయంలో, అమృతధారలు నాలుగు ప్రదేశాలలో పడినట్లు కథనం. ఆ ప్రాంతాలే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అందుకే, కుంభమేళాకు వాటిని అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా పరిగణిస్తున్నారు.
శరీరం, మనస్సు, ఆత్మల కలయిక
పై మూడు నదుల త్రివేణీ సంగమం మానవుని శరీరం, మనస్సు, ఆత్మల కలయికకు ప్రతీకగానూ వేదవిజ్ఞానులు సంభావిస్తారు. జ్ఞానానికి గంగ, భక్తికి యమున, స్వచ్ఛతకు సరస్వతి నదులు ప్రతీకలు అంటారు. సాధువులు (పవిత్ర పురుషులు), సన్యాసులు, యోగులు కుంభమేళాకు కేంద్రంగా మారడం మరో విశేషం. ఈ పరిస్థితులన్నీ ప్రజలను అధికసంఖ్యలో హాజరయ్యేలా ప్రేరేపిస్తున్నాయి.
ఆధునిక భారతదేశంలో కుంభమేళా అద్భుత స్థాయికి పెరిగింది. నాగులు (ఎటువంటి బట్టలు ధరించరు), కల్పవాసులు (రోజుకు మూడుసార్లు స్నానం చేసేవారు), ఉర్ధవవాహర్లు (కఠినమైన తపస్సుల ద్వారా శరీరాన్ని ఉంచుతారని విశ్వసించే వారు) వంటి వివిధ హిందూశాఖలకు చెందిన అనేకమంది పవిత్ర పురుషులు ఈ మేళాకు హాజరవుతారని భావిస్తున్నారు.
వారు తమ సమూహాలకు చెందిన పవిత్ర ఆచారాలను నిర్వహించడానికి ఇక్కడికి వస్తారు. ప్రపంచ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు గుర్తుగా 2017లో కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించడం విశేషం. ఇక ఈసారి కుంభమేళా మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.