8 July, 2026 | 1:55 AM

అంటువ్యాధుల నిర్మూలనకు కృషి చేయాలి

08-07-2026 12:00 AM

డీఎంహెచ్‌ఓ ధనరాజ్

సిద్దిపేట రూరల్, జులై 7: వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, వాటి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) డా. ధనరాజ్ సూచించారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కేంద్రంలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం ల్యాబ్లో నిర్వహిస్తున్న పరీక్షలు, నమూ నాలు, సంబంధిత రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

వర్షాకాలంలో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షయవ్యాధి బాధితుల ఇళ్లకు వెళ్లి క్రమం తప్పకుండా ఫాలోఅప్ నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో మరింత మెరుగైన పని తీరు కనబర్చాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ’డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించి దోమల వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలను సందర్శించి అంటువ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ తనిఖీలో వైద్యాధికారి రాజేందర్, సీహెచ్వో లక్ష్మి, ఆశాలు పాల్గొన్నారు.