21-10-2025 06:54:22 PM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్..
గద్వాల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. మంగళవారం గట్టు మండలంలోని ఆలూరు గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు.ఇంటి నిర్మాణం పనులలో నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పంచాయతీ సెక్రటరీ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుని ఇల్లు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయించాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన ఇసుక మట్టి అందించే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
లబ్ధిదారులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్లను నిర్మించడానికి అవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వ నిధులను ఎప్పటికప్పుడు డబ్బులు వారి ఖాతాకు జమ చేయాలని కలెక్టర్ తెలిపారు. టెక్నికల్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పనులను పూర్తి చేసే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల నుండి ఇళ్ల నిర్మాణానికి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకొని,పనులను వేగంగా పూర్తి చేయాలని, దశలవారీగా డబ్బులు ఖాతాలో వెంటనే జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.