calender_icon.png 22 October, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

21-10-2025 08:34:26 PM

సిద్దిపేట రూరల్: నారాయణరావుపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్.. పిఎచ్‌సీ భవనంలో మేజర్, మైనర్ మరమ్మతులు జరుగుతున్నందున పక్కనున్న ఆయుష్ కేంద్రంలో తాత్కాలికంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది వివరించారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించిన కలెక్టర్, సంతకాలు చేసినప్పటికీ కొంతమంది సిబ్బంది హాజరుకాలేదని గమనించారు. విచారణలో మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు, హెల్త్ ఎడ్యుకేటర్ పాండురంగాచారి 12.30 గంటలకు వెళ్ళారని, హెల్త్ సూపర్వైజర్లు సునీత, లక్ష్మీదేవిపల్లి, సుధారాణి రాఘవపూర్ గ్రామాల్లో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారని సిబ్బంది తెలిపారు.

ఓపి, మూవ్మెంట్ రిజిస్టర్‌లను పరిశీలించిన కలెక్టర్, నెలలో ఎక్కువ రోజులు ‘టూర్’గా రాసి విధులకు రాకుండా తప్పించుకుంటున్నారని గుర్తించారు. ఈ విషయంలో కలెక్టర్ రిజిస్టర్‌లో గమనిక నమోదు చేసి, మెడికల్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌డిహెచ్ఓకి ఫోన్ ద్వారా ఆదేశించారు. విధులకు న్యాయం చేస్తూ, ప్రజలకు సమయానికి సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని గుర్తుచేస్తూ, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.