21-10-2025 08:26:17 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ తండాలో పండగ పూట సోమవారం సాయంత్రం ఘోర హత్య చోటుచేసుకుంది. గుగులోత్ రాదిబాయి(65) తన ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తుండగా, ఆభరణాల కోసమే ఆమెపై దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాదిబాయి వద్ద 60 తులాల వెండి ఆభరణాల కోసం అదే తండాకు చెందిన మెగావత్ సవాయి సింగ్ గొడ్డలితో దాడి చేసి, చున్నీతో ఉరివేసి హతమార్చాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని కూడా దాడి చేసినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తకుండా భారీ అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.