14-10-2025 09:10:08 AM
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో(Suryapet) విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు(ఎస్) మండలం బోట్యా తండాలో(Botya Thanda) వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భూక్య లచ్చు(65), వీరమ్మ(60)గా గుర్తించారు. వీరికి ముగ్గురు కొడుకులు, కుమార్తె. వీరందరికీ పెండ్లిళ్లు చేశారు. కన్నకొడుకులకు భారం కావొద్దనుకున్నారేమో ఇంట్లో గడియ పెట్టుకుని పెట్రోల్ పోసుకుని దంపతులు నిప్పంటించుకున్నారు.
గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. తండా వాసులు దర్వాజలు పగలగొట్టి లోపలికి వెళ్లే సరికి వీరమ్మ అప్పటికే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన లచ్చును సూర్యాపేట సర్కార్ దవాఖానాకు తరలించారు. చికిత్స పొందుతూ లచ్చు ప్రాణాలు కోల్పోయాడు. కొన్నాళ్లుగా తన తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అనారోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని కుమారుడు తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ దంపతుల ఆత్మహత్య జిల్లాలో చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.