calender_icon.png 13 December, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య

13-12-2025 06:11:44 PM

 ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్

 మూఢనమ్మకాలను నమ్మవద్దు

నిర్మల్ ఏ ఎస్ పి ఉపేందర్ రెడ్డి

నిర్మల్: మంత్రాలు చేస్తున్నాడని వృద్ధుడు దేశినేని భీమయ్య (60 )ను దారుణంగా హత్య చేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో నిర్మల్ ఏ ఎస్ పి ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కడెం మండలంలోని గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన భీమయ్య అనే వృద్ధుడు తమ గ్రామంలో మంత్రాలు చేయడంతో తమవారికి ఆరోగ్యం పాడవుతుందని అనుమానించిన నిందితులు ముత్తి నరేష్, ముత్తి మల్లేష్ ,లు పదవ తేదీ రాత్రి 8 గంటలకు వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు.

అడ్డుకున్న అతని తల్లి గంగమ్మను కూడా గాయపరిచారు. అనంతరం సమీపంగా ఉన్న అటవీ ప్రాంతంలో కట్టెలతో కాల్చి వేయగా అదే మండలం ఇస్లాంపూర్ లో ఉన్న మృతుని కూతురు కోమటి లక్ష్మి సమాచారం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సిహెచ్ అజయ్, కడం ఎస్సై సాయి కుమార్, లు సంఘటన స్థలానికి చేరుకుని చితిలో కాలుతున్న ఎముకలను స్వాధీనం చేసుకుని డిఎన్ఏ పరీక్షల కోసం పంపించినట్లు ఏ ఎస్ పి తెలిపారు. ఈ సందర్భంగా సంఘటనను చాకచక్యంగా ఛేదించి 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేయడం తో సీఐ అజయ్, ఎస్ఐ సాయి లను ఎ.ఎస్.పి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మూఢనమ్మకాలను నమ్మవద్దని, ప్రజలు వాస్తవంలో జీవించాలని, ఇలాంటి అపోహల వల్ల మృతులు, నిందితుల కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం ఉందని వీటికి ప్రజలు తావు ఇవ్వకూడదని ఏ ఎస్ పి ఉపేందర్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో పోలీసు శాఖ తరపున అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తామని ఆయన అన్నారు.