calender_icon.png 19 December, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఇష్టారాజ్యంగా ఎన్నికల విధులు!

11-12-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులు డ్యూటీలు సక్రమంగా వేయకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల డ్యూటీ కేటాయింపులో అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరికి రెండు, మూడు విడతల డ్యూటీలు వేయగా, మరికొందరికి అసలు విధులే కేటాయించలేదు.

ఇలా ఇష్టారీతిన డ్యూటీలు కేటాయించడంపై టీచర్లు, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. భూపాల్ పల్లి, హనుమకొండ, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, జోగులాంబ గద్వాల, సిరిసిల్ల కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.  ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల పేర్లు, క్యాడర్/హోదా ఫోన్ నంబర్ల విషయంలో చాలా తప్పులు దొర్లాయి. సాక్షాత్తు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల్లో పలు తప్పులు ఉండటంతో ఏం చేయాలో తోచక టీచర్లు తలలు పట్టుకుంటున్నారు.

కొన్ని ఉత్తర్వుల్లో పేర్లు తప్పుగా నమోదు చేశారు. స్కూల్ అసిస్టెంట్లకు రిటర్నింగ్ ఆఫీసర్లుగా (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా (ఏఆర్వో) డ్యూటీలు వేశారు. పంచాయతీ ఎన్నికల విధుల కేటాయింపుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ర్యాండమైజేషన్ పద్ధతిలో డ్యూటీలు వేశామంటూ తప్పించుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందించారు.

చాలా స్కూళ్లలో ఇద్దరే టీచర్లు ఉంటే, ఇద్దరికీ డ్యూటీలు వేయడంతో ఆయా స్కూళ్లు మూసేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఈ ప్రభావం పదో తరగతి విద్యార్థులపై పడనున్నది. ప్రతీ ఎన్నికల్లో అధికారుల తప్పిదం, అవగాహన లోపం వల్ల ఎలక్షన్ డ్యూటీ చేసే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నికల కమీషన్ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఉపాధ్యాయుడు ఉద్యోగి కి సమానంగా విధులు పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 సతీశ్‌రెడ్డి, వరంగల్