11-12-2025 12:00:00 AM
అమెరికాలో పని చేయడానికి అనుమతిచ్చే హెచ్-1బీ వీసా, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే హెచ్-4 వీసా దారులకు అమెరికా విదేశాంగ శాఖ పిడుగు లాంటి వార్తను చెప్పింది. ఈ వీసాలపై అమెరికాకు రావాలనుకునేవారు ఇకపై తప్పనిసరిగా తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా వెట్టింగ్ (వీసా జారీ చేయడానికి ముందు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించడం) పాలసీని విస్తృతం చేశారు. తాజాగా వీసా వెట్టింగ్‌లో భాగంగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్ అకౌంట్లలోకి మార్చుకోవాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 15 నుంచి అధికారులు వాటిని పరిశీలిస్తారు.
లింక్డిన్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ఖాతాలో అమెరికా ప్రజల భద్రతకు ముప్పు కలిగించే వ్యాఖ్యలు ఉన్నట్లు తేలితే హెచ్-1బీ వీసా మంజూరు చేయడం రద్దు చేస్తారు. విద్యార్థులు, ఎక్సేంజ్ విజిటర్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ లెక్కన వీసాదారుల సోషల్ మీడియా ఖాతాల్లో రాజకీయ అభిప్రాయాలు, ఉద్రిక్తత కలిగించే వ్యాఖ్యలు, రెజ్యుమె వివరాల్లో తేడాలు కనిపిస్తే వీసా ఆమోదానికి ఆటంకాలు ఏర్పడనున్నాయి.
ఇప్పటికే అమెరికాలోని టెక్ కంపెనీల్లో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు తమ సోషల్ మీడియా ఖాతాలను పూర్తిగా తనిఖీ చేసుకోవాలని ఇప్పటికే హెచ్చరించింది. అయితే హెచ్--1బీ వీసాల కోసం దరఖాస్తులు ఎక్కువగా భారతీయుల నుంచే వస్తుండడం ఆందోళన కలిగించే అంశం. అంతేకాదు కొత్త నిబంధన కారణంగా భారత్‌లోని పలు అమెరికా కాన్సులేట్లలో అనేక హెచ్-1బీ వీసా ఇంటర్యూలు రద్దయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 85 వేల వీసాలను రద్దు చేసినట్లు ట్రంప్ యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ 85వేల వీసాదారుల్లో 8 వేల మందికి పైగా విదేశీ విద్యార్థులుండడం గమనార్హం. మద్యం సేవించి వాహనం నడపడం, దొంగతనాలు, దాడులకు పాల్పడిన నేరాలు ఉండడంతో వీసాలు రద్దు చేసినట్లు పేర్కొంది. మరోవైపు భారత్ నుంచి బియ్యం డంపింగ్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, దీనిని అరికట్టేందుకు మరోసారి సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. అమెరికన్ మార్కెట్లోకి భారత్, వియత్నాం, థాయీలాండ్ వంటి దేశాల నుంచి బియ్యాన్ని డంప్ చేస్తున్నారని, ఈ దిగుమ తుల వల్ల ధరలు తగ్గుతున్నాయని, వీటిపై ఆంక్షలు విధించాలని రైతులు కోరుతున్నట్లు ట్రంప్ తెలిపారు.
అయితే ఈ నెలఖారులోపు భార త్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న తరుణంలో మరోసారి సుంకాలు విధిస్తామనడం ట్రంప్ అవకాశవాద వైఖరికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ సుంకాల పెంపు అంశం ఇరుదేశాల వాణిజ్య చర్చల్లో ప్రధాన అంశమయ్యే అవకాశముంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో పొరుగు దేశం కెనడా హెచ్ వీసా దారులపై తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించే అంశం. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలను నియమించుకునేందుకు కెనడా.. 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబ డులు పెట్టినట్లు ప్రకటించడం సానుకూలాంశం.