calender_icon.png 23 January, 2026 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'పురం' ఎన్నికల గరం గరం

23-01-2026 04:58:56 PM

గెలుపు గుర్రాల వేట... భారీ సంఖ్యలో ఆశావాహులు... 

దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రధాన పార్టీలు...

అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జనలు...

రిజర్వేషన్లతో మారిన పోటీదారుల స్థానాలు...

ఈనెల 28న అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్...?

బాన్సువాడ,(విజయక్రాంతి): మున్సిపోల్స్ ఎన్నికల వేడి రాజేష్కుంటుంది. పురపాలక ఎన్నికలు జరిపేందుకు  రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ గా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల  సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీలతో పాటు ఈ దఫా జనసేన సైతం రంగంలోకి దిగుతున్నాయి. ప్రధాన పార్టీల నుండి బీఫాం పొందేందుకు ఐదు నుండి పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటీ కోసం వచ్చిన దరఖాస్తుల స్వీకరణ గత రెండు రోజులుగా వేగవంతంగా కొనసాగుతోంది.

అందులో ఆయా వార్డుల్లో వారికున్న ఉనికి, ఓటర్ల మద్దతును పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో నేతలు తలామునకులవుతున్నారు. ఎవరిని ఒప్పించాలి.. ఎవర్ని మెప్పించాలి అన్న విషయాల్లో ముఖ్య నేతలు తర్జనభజన పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీలతోపాటు నిజామాబాద్ నగర పాలక ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ నగర పాలకంలో 60 డివిజన్లు ఉండగా, అక్కడ కూడా పోటీ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఒక్కో డివిజన్ కు  పదుల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఎవరిని పార్టీపరంగా బరిలోకి దింపాలన్న విషయంలో పరిశీలన ప్రక్రియ వేగవంతమవుతుంది.

పెద్దల ఆశీర్వాదం కోసం...

ఆయా డివిజన్, వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రధాన పార్టీల నుండి బీఫామ్ తమకే వచ్చే విధంగా పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి ఆశీర్వాదం కోసం వెంపర్లాడుతున్నారు. తమకు ఓటు బ్యాంకు ఉందని, గెలిచి తీరుతానని వారి వారి ధీమాను వ్యక్తం చేస్తూ పార్టీ నుండి బీఫామ్ అందించాల్సిందిగా వేడుకుంటున్నారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీల జిల్లా నేతలతో పాటు ఎమ్మెల్యేల వద్ద అభ్యర్థుల ఎంపిక చర్చ హాట్ హాట్ గా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలకు చెందిన జిల్లా పార్టీ అధ్యక్షులు తోపాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు సైతం ఇందులో నిమగ్నం కావడంతో ఎవరికి అభ్యర్థితం ఖరారు అవుతుందన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.

పార్టీ జిల్లా అధ్యక్షుడికి నచ్చిన అభ్యర్థికి బి ఫాం ఇద్దామంటే ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు అట్టి అభ్యర్థి నచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వారి వారి అనుయాయులకు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే విషయంలో ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నిజామాబాద్ నగర మేయర్ పదవితో పాటు డివిజన్ కార్పొరేటర్ల విషయంలో ఎంపిక ఆయా పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారుతుందని సమాచారం. బరిలోకి నిలిచేందుకు వస్తున్న అభ్యర్థులలో ఇద్దరు ముగ్గురికి మంచి మద్దతు ఉన్నప్పటికీ అందులో ఎవరికి పార్టీ పరంగా రంగంలోకి దింపాలన్న విషయంలో ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు.

కామారెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇకపోతే ప్రధానంగా బాన్సువాడ మున్సిపాలిటీ పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎమ్మెల్యే పోచారం ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోపాటు  బిఆర్ఎస్, బిజెపి పార్టీలు తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ నుండి బాన్సువాడ మున్సిపాలిటీకి బరిలో ఉండే అభ్యర్థులు ఎవరన్నది బహిరంగంగా బయటకు వచ్చినప్పటికీ, బి ఆర్ఎస్ పార్టీ తరఫున కూడా  అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకొనుంది.

బాన్స్వాడ మున్సిపాలిటీ పై గులాబీ జెండాను ఎగురవేయాలి అన్న తపనతో  మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్  బాజిరెడ్డి గోవర్ధన్ రంగంలోకి దిగారు. బాన్సువాడ  మున్సిపాలిటీలో ఉన్న 19 వార్డుల్లో అత్యధిక స్థానాలను చేజిక్కించుకునేందుకు గెలుపు గుర్రాల వేట కొనసాగిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక తో పాటు వారి గెలుపు కోసం తీవ్ర కృషి సలుపుతున్నట్లు కూడా ప్రకటించారు. మరోవైపు పెద్దాయన  అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. దాదాపుగా 19 వార్డులో ఎవరెవరిని నిలబెట్టాలన్న అంశంపై ఆయా వార్డుల్లో ఉన్న స్థితిగతులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

చాప కింద నీరులా బిజెపి...

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహా రిస్తుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను చూసి చాకచక్యంగా వారి అభ్యర్థుల జాబితాను ప్రకటించే విషయంలో తగు జాగురు కత తో వివరిస్తున్నారు. బహిరంగంగా రెండు ప్రధాన పార్టీల నుండి అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ బీజేపీ పార్టీ అభ్యర్థుల పేర్లు మాత్రం గోప్యం గానే ఉంచుతున్నారు. బిజెపి వ్యవహరిస్తున్న వ్యూహం పొలిట్రిక్స్ ట్రిక్స్ లా కనిపిస్తుంది.

చైర్మన్ అభ్యర్థుల ఎంపికలోనూ...?

మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ క్యాండిట్ల  ఎంపిక లోను అమీ తుమీ అనే పరిస్థితి నెలకొంది. ఎవర్ని క్యాండెట్ గా ప్రకటించాలో ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. చైర్మన్గా బరిలోకి దిగే అభ్యర్థి, అభ్యర్థినిలు తమ ప్యానెల్ను గెలిపించుకునేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. అట్లాంటి వ్యక్తులను ప్రధాన పార్టీలు చైర్మన్గా వారి పేర్లను ప్రకటించేందుకు తల మునుకలవుతున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ విషయానికి వస్తే ముందుగా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ నాయకుడైన జుబేర్ సతీమనిణి మున్సిపల్ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు.

అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు సతీమణి నా, వారి కోడలినా, మాజీ ఎంపీపీ రేష్మ ఎజాజ్ నా,మరి ఎవరైనా బీసీ మహిళ ను ఎంపిక చేస్తారన్న విషయంలో ఇంకా తేట తెల్లం కాలేదు. ఈసీ మహిళా వర్గానికి చెందిన మరికొందరు నాయకులు ఉన్నప్పటికీ, ఎవరికి అవకాశం ఇవ్వాలన్న విషయంలో అధికార పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

సవాల్ గా తీసుకుంటున్న ముఖ్య నేతలు...

బాన్సువాడ మున్సిపాలిటీ పై ఇద్దరు ముఖ్య నేతలు దృష్టి సారించారు. అందులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ప్యానెల్ను గెలిపించుకునే విషయంలో చాలెంజ్ గా తీసుకుంటున్నారు. అదే రకంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్యానల్ ను గెలిపించుకునేందుకు నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ సైతం సవాల్ గా తీసుకుంటున్నారు. ఇరువురు మధ్యన ఇరుకుడిలో  బిజెపి పార్టీ సైతం తాము నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు అక్కడక్కడ ఎంఐఎం పార్టీ తన ఉనికిని చాటుకునే కసరత్తు మొదలు పెట్టింది. తాజాగా జనసేన సైతం వార్డు మెంబర్లను నిలబెట్టే విషయంలో ప్రయత్నాలు సాగిస్తోంది. ఏదేమైనా పురపాలక ఎన్నికలు పట్టణ ఓటర్లకు మంచి గమ్మతు నిచ్చే పరిస్థితి ఏర్పడబోతోంది.