17-12-2025 06:09:21 PM
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న 3వ విడత ఎన్నికల కొరకు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం మోతుగూడ, కాగజ్‌నగర్ మండలం కోసిని, రెబ్బెన మండలం ఇందిరానగర్, రెబ్బెన, తిర్యాణి మండలం కన్నెపల్లి, తిర్యాణి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 3వ విడతలో భాగంగా ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాలలో 108 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 2 స్థానాలు ఏకగ్రీవం కాగా 2 స్థానాలకు నామినేషన్లు రానందున 104 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 938 వార్డు సభ్యుల స్థానాలకు గాను 186 స్థానాలు ఏకగ్రీవం కాగా 8 స్థానాలకు నామినేషన్ దాఖలు కానందున 744 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్, దివ్యాంగుల కోసం ర్యాంపుల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని, ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికలు జరిగేలా అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.