మహా డేంజర్ పోల్..
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట విద్యుత్ ప్రమాదం
- సమాచారం ఇచ్చినా స్పందించని ఏఈ
- గతంలో ఓ లారీ తగిలి విరిగిన స్తంభం
- వచ్చేది వర్షాకాలం.. పట్టించుకోకుంటే పెనుప్రమాదం
- బడ్జెట్ లేదు : శ్రీకాంత్, ఏఈ, విద్యుత్ శాఖ గండీడ్
గండీడ్, మే 5 : పేద మధ్యతరగతి వ్యక్తులకు ప్రభుత్వ వైద్యశాలలే దిక్కు. అది గ్రామీణ ప్రాంతాల వాసులు అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైపు చూస్తుంటారు. ఇది ఇలా ఉండగా గండీడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు 9 మీటర్స్ విద్యుత్ స్తంభం కు గతంలో ఒక లారీ తాకి స్తంభం కింది భాగం విరిగిపోయి ప్రమాదం అంచుకు చేరింది. ఈ విషయాన్ని సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ కి పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ అప్పుడు ఇప్పుడు అంటూ గత ఆరు నెలల నుంచి కూడా కాలయాపన చేస్తూ పట్టించుకోవడంలేదని జనం అసహనం వ్యక్తం చేస్తుండ్రు.
ఏదైనా జరగడానికి జరిగితే మనుషుల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ భయభ్రాంతులతో తిరుగుతున్నామని చెబుతున్న మాట. ఈ స్తంభం ముందుగా 167 హైవే కూడా ఉంది. రాత్రి పగలు అనే భేదం లేకుండా భారీ వాహనాలు సైతం ఈ ప్రాంతంలో తిరుగుతాయి. స్పందించకుంటే తీవ్ర ప్రమాదాలకు ఈ ప్రాంతం నిలయంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా.?
విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అంటూ జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఆసుపత్రి ముందు 102, 108 వాహనాలతో పాటు జనం నిరంతరం తిరుగుతూనే ఉంటారు. వచ్చేది వర్షాకాలం కావడంతో ఈదురు గాలులు కూడా అధికంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా స్పందించి ఈ స్తంభాన్ని తొలగించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
బడ్జెట్ లేదు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు విద్యుత్ స్తంభం విరిగిన విషయం తెలుసు. స్తంభం మార్చేందుకు ప్రస్తుతం బడ్జెట్ లేదు. బడ్జెట్ వచ్చిన తర్వాత మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. అంతవరకు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. అంత త్వరగా స్తంభం విరిగిపోదని అనుకుంటున్నాను.
శ్రీకాంత్, ఏఈ, గండీడ్






